నకిలీ ఏసీబీ అధికారి అరెస్టు 

6 Jul, 2020 08:40 IST|Sakshi
గేదెల మురళీకృష్ణ, వాడ తిరుపతిరావు

పాతపట్నం సీహెచ్‌సీ కాంట్రాక్టు ల్యాబ్‌ టెక్నీషియన్‌ కూడా.. 

చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులు

14 రోజులు రిమాండ్‌ 

పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా): నకిలీ ఏసీబీ అధికారిగా నగదు వసూళ్లకు పాల్పడుతున్న మండలంలోని పాశిగంగుపేటకు చెందిన గేదెల మురళీకృష్ణను, అతనికి సహకరించిన పాతపట్నం సీహెచ్‌సీ కాంట్రాక్టు ల్యాబ్‌ టెక్నీషియన్‌ వాడ తిరుపతిరావును పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్‌ఐ టీ రాజేష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... ఫిబ్రవరి 27న పాతపట్నం సామాజిక ఆస్పత్రి (సీహెచ్‌సీ)లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌ ఇన్‌చార్జి, ఎస్‌ఆర్‌ మెడికల్‌ ల్యాబ్‌ నిర్వాహకుడు బమ్మిడి అప్పలనాయుడు, కాంట్రాక్టు ల్యాబ్‌ టెక్నీషియన్, ఏఎంసీ ల్యాబ్‌ నిర్వాహకుడు వాడ తిరుపతిరావులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఈ నెల 1న ఇద్దరిని శ్రీకాకుళం ఏసీబీ కార్యాలయంలో విచారణ కోసం పిలిపించారు. ఈ నెల 2న ఉదయం అప్పలనాయుడుకు ఫోన్‌ చేసి రూ.2.50 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానంటూ మురళీకృష్ణ డిమాండ్‌ చేశాడు.

అదే రోజు సాయంత్రం మరలా ఫోన్‌ చేసి, అరెస్టు చేయాలా డబ్బులు తెస్తావా? అని ఫోన్లో బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడి ఫోన్‌ నంబర్‌ను ట్రాక్‌ చేశారు. ఈ నెల 4న మళ్లీ ఫోన్‌ చేసి డబ్బులు పట్టుకుని జలుమూరు మండలం చల్లవానిపేట కూడలికి రావాలని ఆదేశించాడు. వెంటనే పోలీసులు బాధితుడిని తొలుత పంపించి చాకచక్యంగా వెళ్లి పట్టుకుని పాతపట్నం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమదైనశైలిలో రోజంతా విచారించగా వాడ తిరుపతిరావు ప్రోద్బలంతో చేసినట్లు ఒప్పుకున్నాడు. దాంతో నిందితుడి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా నిర్ధారణకు వచ్చి శనివారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాతపట్నం సీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ రిపోర్టులు రావడంతో కొటబొమ్మాళి కోర్టు జడ్జి కే ప్రకాష్‌బాబు ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్‌ విధించారు. పాతపట్నం సబ్‌జైలుకు నిందితులను తరలించామని ఎస్‌ఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు