అవకాశాలు అంటూ యువతకు సైబర్‌ వల

3 Jul, 2020 11:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి పేర్లతో కొందరు కేటుగాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక జనాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త మోసాలకు తెరలేపారు. 

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి పేరుతో నకిలీ వాట్సప్‌ నెంబర్‌ సృష్టించి కథానాయికలు, మోడల్స్‌ కావాలని, ఆసక్తి ఉన్నవారు ఫోటోలు, వీడియోలు పంపాలని యువతకు కొందరు కేటుగాళ్లు సైబర్‌ వల వేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి ఆశపడిన ఆశావాహుల నుంచి వేలాది రూపాయలు వారి ఖాతాల్లో జమచేసుకుంటున్నారు. 

ఇలా నటన, మోడలింగ్‌లో శిక్షణ, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వేలల్లో డబ్బులు దోచుకొని ఆ నేరగాళ్లు ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రకటనలను చూసిన కొంతమంది యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన అజయ్‌ భూపతి తన పేరుపై నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. విజయ్‌లా మాట్లాడి పలువురు యువతులను ఆకర్షించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, విజయ్‌ దేవరకొండ బృందం ఓ ప్రణాళిక రచించారు. ఒక యువతితో సాయి కిరణ్‌తో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించారు. సదరు యువతిని కలిసేందుకు నిందితుడు సాయి కిరణ్‌ హైదరాబాద్‌కు రాగానే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు