బిస్వాస్‌ దాదా... బీఏఎంఎస్‌!

8 Dec, 2017 08:09 IST|Sakshi

నకిలీ ఆయుర్వేద డాక్టర్‌కు అరదండాలు

ఔషధాల తయారీ సైతం సొంతంగానే

అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గోపాష్‌ భద్ర చదివించి టెన్త్‌... వెస్ట్‌ బెంగాల్‌ నుంచి వెళ్ళి చెన్నైలో ఆయుర్వేద డాక్టర్‌ వద్ద పని చేశాడు... ఈ ‘అనుభవం’తో హైదరాబాద్‌కు వచ్చి ‘డాక్టర్‌ బిస్వాస్‌’గా మారాడు... తన పేరు చివర బీఏఎంఎస్‌ అనే డిగ్రీ తగిలించుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించాడు... ఈ నకిలీ ఆయుర్వేద డాక్టర్‌ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులు ప్రశ్నించగా... బీఏఎంఎస్‌ ఫుల్‌ఫామ్‌ చెప్పలేకపోవడంతో పాటు కనీసం అతడు ప్రింట్‌ చేయించిన కరపత్రాన్నీ చదవలేకపోయాడని డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపాష్‌ భద్ర తన స్వస్థలంలో పదో తరగతి చదివాడు.

తొలినాళ్ళల్లో కోల్‌కతాలో వివిధ రకాలైన పనులు చేసుకుని జీవనం సాగించాడు. 2011లో చెన్నైకు వెళ్ళిన అతను అక్కడ బీఏఎంఎస్‌ పూర్తి చేసిన ఆయుర్వేద డాక్టర్‌ వద్ద సహాయకుడిగా పని చేశాడు. అక్కడ తన డాక్టర్‌ పైల్స్, ఫిషర్‌ తదితర వ్యాధులకు ఎలా చికిత్స చేస్తున్నారో పరిశీలించాడు. ఈ అనుభవంతో తానే ఓ బీఏఎంఎస్‌ డాక్టర్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రాక్టీస్‌ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుని ఇక్కడకు వచ్చాడు. తన పేరును డాక్టర్‌ బిస్వాస్‌గా పేర్కొంటూ బీఏఎంఎస్‌ డిగ్రీ చేసినట్లు నమ్మిస్తూ గాంధీనగర్‌ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ‘జోతి క్లినిక్‌’ ఏర్పాటు చేశాడు.

అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై తమ వద్ద డాక్టర్‌ అనిత అనే హెచ్‌ఏఎంస్‌ పూర్తి చేసిన డాక్టర్‌ సైతం ఉన్నట్లు చూపించాడు. చెన్నైలో నేర్చుకున్న పైల్స్, ఫిషర్‌ తదితర వ్యాధులకు ‘వైద్యం’తో పాటు చర్మ వ్యాధుల్నీ తగ్గిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీనికోసం కరపత్రాలు ముద్రించి జనసమర్థ ప్రాంతాల్లో పంచిపెట్టేవాడు. వీటికి ఆకర్షితులై వచ్చిన అమాయక రోగులకు వైద్యం చేయడం మొదలెట్టాడు. నెయ్యి, హెయిర్‌ జెల్స్, టాల్కం పౌడర్, వేప ఆకులు, కొబ్బరినూనె వినియోగించి తానే కొన్ని ఆయుర్వేద ఔషధాలను తయారు చేశాడు. వీటినే రోగులకు ఇస్తూ అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ నకిలీ డాక్టర్‌ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది.

ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్‌కుమార్, జి.తిమ్మప్ప గురువారం జోతి క్లినిక్‌పై దాడి చేశారు. నకిలీ డాక్టర్‌ బిస్వాస్‌ను అరెస్టు చేయడంతో పాటు అనేక నకిలీ ఆయుర్వేద మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బీఏఎంఎస్‌ డిగ్రీకి ఫుల్‌ఫామ్‌ ఏమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నీళ్ళు నమిలాడు. అతడు ముద్రించిన కరపత్రాలను చూపించి చదవమంటే తడబడ్డాడు. ఇలాంటి వ్యక్తి ఆరు నెలలుగా అనేక మందికి వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. నకిలీ డాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు