నకిలీ బాబా పట్టివేత 

9 Jul, 2018 10:09 IST|Sakshi
పోలీసులు పట్టుకున్న నకిలీ బాబా

కరీంనగర్‌ క్రైం: ఉద్యోగాలు ఇప్పిస్తానని.. అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తానని, ధనప్రాప్తి సిద్ధించేలా పూజలు నిర్వహించడంతో పాటు భూతాలను దిగ్బంధం చేసి సర్వ సమస్యలు తోలగిస్తానంటూ.. ఎనిమిదేళ్లుగా పూజల పేరిటా అమాయక ప్రజలను మోసం చేస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్న నకిలీ బాబాను టాస్క్‌ఫొర్స్‌ పోలీసులు అదివారం పట్టుకున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చామనపల్లికి చెందిన బండారి పొచమల్లు(47) ఎనిమిదేళ్లుగా తనకు మంత్రతంత్రాలు తెలుసునని ప్రచారం చేసుకున్నాడు. తన మాటలు నమ్మి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మొదట రూ. 50 నుంచి రూ.100 రూపాయలు తీసుకుని కొబ్బరికాయ ఇచ్చి ఇంటి ఎదురుగా కట్టుమని చెబుతాడు.

అయినా సమస్య పరిష్కారం కాకపోక మళ్లీ తన వద్దకు వచ్చే వారికి మరింత భయబ్రాంతులకు గురి చేసి ఇంటికి వచ్చి పూజలు చేయాలని చెప్పి వారి ఇంటికి వెళ్లి వివిధ రకాల పూజలు చేసి వారి నుంచి రూ.5 నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తాడు. ఇలా కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది అతడి వ్యవహారం. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫొర్స్‌ పోలీసులు ఆదివారం పూజలు చేస్తున్న అతడి ఇంటిపై దాడి చేని పొచమల్లును రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

ఇంటి నుంచి పూజలకు ఉపయోగించే డమరుకం, జాకేట్‌బట్టలు, కాళ్ల గజ్జెలు, ఈరగోల, ఊదుచిప్ప, ఇత్తడి తాంబూలంతో పాటు రూ.6720 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని రూరల్‌ పోలీసులకు అప్పగించగా.. వారు కేసు నమోదు చేశారు. నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని అందుబాటులో ఉన్న శాస్త్రీయ విధానాన్ని ఆశ్రయించాలని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో టాస్క్‌పొర్స్‌ సీఐలు శ్రీనివాసరావు, మాధవి, ఎస్సైలు రమేశ్, వివేక్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు