బోల్తా కొట్టించిన బురిడీ స్వామిజీ!

13 Jul, 2018 07:30 IST|Sakshi

మహిళకు మాయమాటలు చెప్పి.. రూ. 2లక్షలతో ఉడాయింపు

రాజమండ్రిలో రూ.50 లక్షలు వసూళ్లు? 

శివ చైతన్యం స్వామీజీపై కేసు నమోదు

పోలీసుల అదుపులో బురిడీస్వామి, తేజస్వీ

కంచికచర్ల (నందిగామ): అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసి ఉడాయిస్తున్న బురిడీ స్వాములకు  తెలుగు రాష్ట్రాల్లో కొదువలేకుండా పోతోంది. కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.2లక్షలతో ఉడాయించిన ఓ బురిడీస్వామి ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ దావాల సందీప్‌ తెలిపిన కథనం మేరకు హైదరాబాద్‌కు చెందిన తత్వపీఠ చైతన్యమఠం శ్రీ రామ శివచైతన్యం స్వామి, తేజస్వి మేనేజింగ్‌ ట్రస్టు సభ్యులు నాలుగు రోజుల క్రితం కంచికచర్ల సర్పంచి గద్దే ప్రసాద్‌ వద్దకు వచ్చి జాతకం చూస్తామని, ఆర్థిక, ఆనారోగ్య సమస్యలుంటే పూజలు చేసి పరిష్కరిస్తామని నమ్మబలికారు. దీనికి ఖర్చు రూ. 5లక్షల వరకు అవుతుందని తెలిపారు. 

అయితే తమ వద్ద అంత నగదు లేదని సర్పంచి ప్రసాద్‌ భార్య పావని రూ.2లక్షలు వారికి ముట్టజెప్పింది. మరిన్ని పూజలు చేయాల్సి ఉందని, మరలా తిరిగి వస్తామని చెప్పి బంగారపు శ్రీ చక్రం ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం పావని  స్వామీజీ ఇచ్చిన శ్రీచక్రంను బంగారు షాపులో చూపించగా శ్రీ చక్రం నకిలీదని తేలింది. దీంతో పావని శ్రీరామ శివచైతన్యం స్వామి, తేజస్వినిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  తత్వ పీఠ చైతన్య మఠం శ్రీరామ శివ చైతన్యం స్వామీ ఇటీవల రాజమండ్రిలోని పావని బంధువుల వద్దకు వెళ్లి  పూజలు చేస్తామని చెప్పి వారి నుంచి కూడా ఇలాగే దాదాపు రూ.50లక్షలు కాజేశాడని తెలిసింది. సర్పంచి బంధువులు ఈ విషయాన్ని గద్దే ప్రసాద్‌కు తెలియ జేశారు. కాగా,  శ్రీ రామ శివచైతన్యం స్వామితో పాటు తేజస్విని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా