తాంత్రిక పూజల పేరుతో రూ. 20లక్షల టోకరా

13 Jan, 2018 08:28 IST|Sakshi

చేబ్రోలు: తాంత్రిక పూజలు నిర్వహించి కుటుంబ సమస్యలు లేకుండా చేస్తానని,  అనారోగ్య సమస్యలు తీర్చుతానిని చెప్పి గురుస్వామి రూ.20లక్షల వరకు మోసగించినట్లు బాధితుడు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అర్బన్‌ ఎస్పీ ఆదేశాల మేరకు చేబ్రోలు ఎస్‌ఐ వి.బాబురావు  శుక్రవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన కంకణాల హరిబాబు బెంగుళూరులో హోటల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

దైవచింతన, భక్తిభావం కలిగిన హరిబాబు చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుకి భక్తుడు. బెంగుళూరులోని హరిబాబు ఇంటి వద్దకు తీసుకువెళ్లి కుటుంబ సమస్యలు, ఆర్థిక చింతలు తొలగించటం కోసం తాంత్రిక పూజలు కొన్ని నెలలుగా నిర్వహించాడు. అయినా అనారోగ్య సమస్యలు తీరకపోవటంతో పాటు, ఆర్థికంగా నష్టపరిచినట్లు గుర్తించాడు. దీంతో రూ.20లక్షల వరకు వివిధ రకాల ఖర్చుల కోసం డబ్బులు తీసుకొని మోసగించినట్లు బాధితుడు హరిబాబు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ వి.బాబురావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు