పోలీసుల అదుపులో బురిడీ బాబా

11 Apr, 2018 19:39 IST|Sakshi
భక్తులతో మాట్లాడుతున్న సుధాకర్‌ మహరాజ్‌(ఫైల్‌)

సాక్షి, నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నెల్లూరులోని సింహపురి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్‌ సుధాకర్‌ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని, బాబా చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి అన్నారు.

నగరంలోని కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న సుధాకర్‌ మహరాజ్‌ అలియాస్‌ టీచర్‌ సుధాకర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13 నుంచి 108 రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితంగా ఇవ్వడం ఆపేశారు. తర్వాత పుస్తకానికి వెయ్యి రూపాయల ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి నాలుగు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు.

ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో  సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ. కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు