రైల్వే ఉద్యోగులూ తస్మాత్‌ జాగ్రత్త!

15 Dec, 2018 11:31 IST|Sakshi

జీతం జమ చేస్తామంటూ వివరాల సేకరణ

అన్నీ చెప్పేస్తే అంతే సంగతులు

అప్రమత్తంగా ఉండాలంటున్న డివిజనల్‌ అధికారులు

‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీకు నెల జీతం బ్యాంకుకు పంపించడంలో సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్‌లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ వివరాలు చెబుతారా..?’’  – గుంతకల్లు రైల్వే డివిజన్‌ అధికారులకు వారం రోజుల్లో తరచూ వస్తున్న ఫోన్‌ కాల్‌ సారాంశమిది.

అనంతపురం, గుంతకల్లు: ఆన్‌లైన్‌ మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నిన్నటి వరకు బ్యాంకు ఉద్యోగుల పేరుతో వినియోగాదారులకు ఫోన్‌ చేసి వారి అంకౌట్‌ నంబర్లు, ఏటీఎం వివరాలు తెలుసుకొని ఖాతాలోని సొమ్మును కాజేసేవారు. దీనిపై జనం చైతన్యవంతులు కావడంతో... ఇపుడు కొత్తగా రైల్వో ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారు. రైల్వే సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ పేరుతో గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు తిరుపతి, రేణిగుంట, రాయాచూర్‌ తదితర ప్రాంతల్లోని రైల్వే ఉద్యోగుల మొబైల్‌ నంబర్లుకు ఫోన్లు చేస్తున్నారు... ‘‘నేను ఏడీఎఫ్‌ఎం మాట్లాడుతున్నాను... మీ జీతం బ్యాంకులో వేసేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఎదురైంది.. కంప్యూటర్‌లో మీ బ్యాంకు వివరాలు మళ్లీ నమోదు చేయాల్సి ఉంది...మీ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌...ఏటీఎం కార్డుపై ఉన్న 16 సంఖ్యల నంబర్, పేరు, సీవీవీ నంబర్‌ చెప్పండి’’ అని ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఉద్యోగులపై వల వేస్తున్నారు. 

గత వారం రోజులు నుంచి పదులు సంఖ్యలో ఉద్యోగులకు ఈ తరహా కాల్స్‌ వచ్చాయి. అయితే ఉద్యోగులు కొందరు అప్రమత్తంగా ఉండడంతో ప్రస్తుతానికి ఎవరికీ ఇబ్బంది తలెత్తలేదు. మరోవైపు సీనియర్‌ డీఎఫ్‌ఎం చంద్రశేఖర్‌బాబుకు ఈ సమాచారం అందడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అకౌంట్స్‌ విభాగం ఉద్యోగుల నుంచి గానీ, బ్యాంకుల నుంచి గానీ ఎవరూ బ్యాంకు ఖ>తాల వివరాలు అడగరని ఉద్యోగులు గుర్తించాలన్నారు. ఉద్యోగులు తమ  బ్యాంకు ఖ>తా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పకూడదుని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు