సెన్స్‌ లేదు... న్యూసెన్సే!

27 Jan, 2020 09:53 IST|Sakshi

‘డయల్‌–100’కు అనవసర కాల్స్‌ బెడద

సమాచారం కోసంవచ్చే ఫోన్లూ ఎక్కువే

గత ఏడాది మొత్తం 2.6 లక్షల ఫోన్‌ కాల్స్‌

ఎక్కువ ఫోన్లుపశ్చిమ మండలం నుంచే

సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో చోరీనో,మరో నేరమో చోటు చేసుకుంది...  హఠాత్తుగా దుండగులు హంగామా చేస్తూ దాడికి యత్నించారు...  రహదారిపై మీ వాహనాన్నే ఢీ కొట్టిన వ్యక్తి మీతోనే గొడవకు దిగాడు. కళాశాలలో, ఉద్యోగానికో వెళ్తున్న అతివల్ని ఆకతాయిలు మితిమీరి వేధిస్తున్నారు.......ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్‌–100’కు ఆకతాయిల బెడదా తక్కువేం కాదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. నేరాలపై సమాచారం ఇవ్వడానికే కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. 

ప్రజల కోసం నిత్యం పని చేసేలా...
సర్వకాల సర్వావస్థల్లోనూ  ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్నేళ్ల క్రితమే ‘100’ నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ నాలుగేళ్ల క్రితం ‘డయల్‌–100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఫోన్‌కాల్‌ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్‌ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. 

ఏటా లక్షల్లోనే ఫోన్‌కాల్స్‌...
‘డయల్‌–100’కు నగరం నలుమూలల నుంచి రోజుకు గరిష్టంగా 700 నుంచి 800  కాల్స్‌ వస్తుంటాయి. ఇలా వస్తున్న ఫోన్లలో బ్లాంక్‌ కాల్స్, న్యూసెన్స్‌ కాల్స్, అనవసర విషయాలను ప్రస్తావించే ఫోన్లూ వేల సంఖ్యలోనే ఉంటున్నాయి. సోషల్‌ మీడియా, పోలీసు అధికారిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చినా..ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్‌ నెంబర్‌ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు వందల సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెప్తున్నారు. కొందరైతే సిటీ బస్సుల సమాచారం, చిరునామాలు కోరుతూ కాల్స్‌ చేస్తున్న వారూ ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారో, అక్కడ నుంచి వచ్చిన వారో ఇలాంటి కాల్స్‌ చేస్తే ఫర్వాలేదు. నగరంలో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 

చిత్ర విచిత్ర వేధింపులూ ఎక్కువే...
ఈ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసే సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వేధింపులూ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగంతో సంబంధంలేని అంశాలు అడుగుతుంటారు. సిబ్బంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతుంటారు. అసభ్యపదజాలం కాకపోయినా..అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్‌ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్‌ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ..భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైతే వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్‌–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు.  

‘బాక్సు’లతో పాటే తగ్గిన ‘బెదిరింపులు’...
నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాయిన్‌ బాక్సులు ఉండేవి. దుకాణాల్లో ఉంచి నిర్వహించేవి కొన్నైతే..బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసేవి మరికొన్ని ఉండేవి. వీటిని వినియోగించి ఎవరు ఫోన్‌ చేస్తున్నారు? ఎక్కడకు ఫోన్లు చేస్తున్నారు? అనే అంశాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో వీటిని వినియోగించే ఆకతాయిలు ఫలానా చోట బాంబు ఉందనో, మరోటి జరుగుతోందనో చెప్తూ పోలీసుల్ని పరుగులు పెట్టించేవారు. ఈ కాయిన్‌ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్‌ సైతం పూర్తిగా తగ్గిపోయాయి. సెల్‌ఫోన్, ల్యాండ్‌లైన్ల నుంచి ఇలాంటి కాల్స్‌ చేస్తే బాధ్యుల్ని తేలిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ తరహా ఆకతాయిలు వెనుకడుగు వేస్తున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో ఉన్న కొన్ని కాయిన్‌ బాక్సుల్నీ ఈ తరహాలో వినియోగించడానికి ఆకతాయిలు ధైర్యం చేయట్లేదు.  

గతేడాది కాల్స్‌ ఇలా...
బాడీలీ అఫెన్సెస్‌–59,000 (21.99 శాతం)
న్యూసెన్స్‌–55,000 (20.5 శాతం)
మహిళలపై నేరాలు–34,000 (12.67 శాతం)
యాక్సిడెంట్స్‌– 26,000 (9.6 శాతం)
సొత్తు సంబంధ నేరాలు–12,000 (4.47 శాతం)
ఆత్మహత్యలు– 2,200 (0.82 శాతం)
ఇతర నేరాలు, ఎంక్వైరీలు–80,000 (29.82 శాతం)  మొత్తం– 2,68,200
ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు కూడా వస్తుంటాయి. అందుకే నగరంలో నేరాలు, ప్రమాదాల, ఆత్మహత్యల సంఖ్య కంటే వాటికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  
 
జోన్ల వారీగా కాల్స్‌ ఇలా...
వెస్ట్‌ జోన్‌– 91,150 (33.98 శాతం)
నార్త్‌ జోన్‌– 46,786 (17.44 శాతం)
ఈస్ట్‌ జోన్‌– 44,598 (16.62 శాతం)
సౌత్‌ జోన్‌– 43,914 (16.37 శాతం)
సెంట్రల్‌ జోన్‌– 41,752 (15.56 శాతం) 

మరిన్ని వార్తలు