‘పాస్‌ చేసి’ పంపిస్తారు!

14 Nov, 2018 10:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

మూడు ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల మాయాజాలం

విద్యార్థులు, విదేశాలకు వెళ్లే వారికి ‘సహకారం’

బోగస్‌ సర్టిఫికెట్లు తయారు చేసి అందజేత ఐదుగురి అరెస్టు  

19 సంస్థల పేరుతో ఉన్న 1360 సర్టిఫికెట్లు సీజ్‌

సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో విద్యనభ్యసించడా నికి వెళ్లాలని భావిస్తూ వివిధ పరీక్షల్లో ఫెయిలైన, అవసరమైన స్కోరింగ్‌ లేని వారితో పాటు     అవసరమై విద్యార్హతలు లేని వారికి సైతం బోగస్‌ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్‌ ప్రధానంగా విద్యార్థులకే ఎక్కువగా ఈ ధ్రువపత్రాలు విక్రయించినట్లు గుర్తించారు.  వివిధ ప్రాంతాల్లోని మూడు ఏజెన్సీలపై ఏకకాలంలో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఐదుగురు నిందితులను అరెస్టు చేశాయి. వీరి నుంచి 19 విద్యా సంస్థల పేరుతో ఉన్న 1360 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావుతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ వివరాలు వెల్లడించారు. 

కన్సల్టెన్సీల ముసుగులో నకిలీల దందా...
నగరానికి చెందిన జె.శ్రీకాంత్‌రెడ్డి, మహ్మద్‌ అతీఖ్‌ ఉర్‌ రెహ్మాన్‌ వేర్వేరుగా బేగంపేట ప్రాంతంలో జస్ట్‌ వీసా కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఇండో–యూరోపియన్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ సంస్థలను. కె.శరత్‌చంద్ర ప్రసాద్‌ ఎస్సానగర్‌లో రైజర్స్‌ ఆర్గనైజేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఈ వ్యాపారంలో ఉన్న ఈ మూడు సంస్థలు బోగస్‌ సర్టిఫికెట్ల దందా సైతం చేస్తున్నాయి. అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, పోలెండ్‌ తదితర దేశాలకు విద్యాభ్యాసం కోసం వెళ్తున్న విద్యార్థులకు వీసా ప్రాసెసింగ్‌ చేస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆయా దేశాల్లో చదువుకునేందుకు అవసరమైన అనుమతి పొందాలంటే అకడమిక్స్‌లో మంచి మార్కులు ఉండటంతో పాటు ప్రత్యేక పరీక్షల్లో మెరుగైన స్కోరింగ్, నిర్ణీత బ్యాంకు బ్యాలెన్స్‌లు, నిర్దేశిత రికమండేషన్‌ లెటర్స్‌ తప్పనిసరి. అయితే ఈ కన్సల్టెన్సీలకు వచ్చే వారిలో అందరి వద్దా ఇవి ఉండట్లేదు. మరోపక్క అనేక మంది ఫెయిలైన వారూ డబ్బు వెచ్చించి విదేశీ విద్య అభ్యసించాలని ఆసక్తి చూపుతుండటంతో వీరు ముగ్గురూ వాటిని అందించడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించారు. 

ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు  
ఈ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఈ మూడు సంస్థల నిర్వాహకులు టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ షేక్‌తో ఒప్పందం చేసుకున్నారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్స్‌ వినియోగించి నకిలీ సర్టిఫికెట్ల తయారు చేయడంలో పట్టు ఉన్న ఇమ్రాన్‌ ఒక్కో దానికి రూ.10 వేల వరకు వసూలు చేసేవాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అఖిల్‌ మంథి ఈ గ్యాంగ్‌కు ఏజెంట్‌లా వ్యవహరిస్తూ విద్యార్థులను తీసుకువస్తూ కమీషన్‌ తీసుకుంటున్నారు. ఇలా తమ వద్దకు వచ్చిన విద్యార్థులు కచ్చితంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకురావాలంటూ మూడు సంస్థల నిర్వాహకులు సూచించేవారు. ఫెయిలైన, అవసరమైన స్థాయిలో స్కోరింగ్స్‌ లేని వారితో రూ.50 వేల నుంచి రూ.60 వేలకు బేరం కుదుర్చుకుని ఆ మొత్తం ముట్టిన తర్వాత ఆయా సర్టిఫికెట్లను ఇమ్రాన్‌కు పంపేవారు. అతను అవే సర్టిఫికెట్లు స్కాన్‌ చేసి, ఫొటోషాప్‌ ద్వారా అందులోని మార్కులు, స్కోరింగ్స్‌ మార్చేసి ప్రింట్‌ఔట్‌ తీస్తాడు. ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ నుంచి కత్తిరించిన హోలోగ్రామ్‌ను వీటిపై అతికించి, నకిలీ స్టాంపులు కొట్టి కొత్తగా మరో సర్టిఫికెట్‌ తయారు చేసి అందించేవాడు. 

బ్యాంకు బ్యాలెన్స్‌లూ ‘చూపించేస్తారు’...
ఈ గ్యాంగ్‌ కేవలం విద్యార్హత పత్రాలు తయారు చేసి ఇవ్వడమే కాదు... అవసరమైన బ్యాంకు బ్యాలెన్స్‌లూ చూపించేస్తుంది. వివిధ బ్యాంకుల పేర్లతో లెటర్‌హెడ్స్‌ సృష్టించిన ఇమ్రాన్‌ వాటిపై సదరు విద్యార్థి సంబంధీకుడికి భారీ మొత్తం బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉందంటూ ప్రింట్‌ తీసి, స్టాంపులు వేసి, సంతకాలు చేసి ఇచ్చేస్తాడు. ఇందుకు గాను ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసేవారు. దాదాపు నాలుగున్నరేళ్ళుగా ఈ మూడు సంస్థల నిర్వాహకులు మిగిలిన ఇద్దరితో కలిసి యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. వీరి నుంచి ఓ నకిలీ సర్టిఫికెట్‌ పొందిన వ్యక్తి ఇటీవల నగరంలోని ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అతడి ధ్రువపత్రంపై అనుమానం వచ్చిన సదరు సంస్థ నిర్వాహకులు ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు తాత శ్రీధర్, కె.శ్రీనివాసులు తమ బృందాలతో రంగంలోకి దిగి మూడు కన్సల్టెన్సీలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఫలితంగా ఐదుగురు నిందితులు చిక్కడంతో పాటు భారీ సంఖ్యలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, హోలోగ్రామ్స్‌ కట్‌ చేసిన అసలు సర్టిఫికెట్లతో ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను స్థానిక పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు