అడ్డుకట్టేది..!

13 Apr, 2018 12:15 IST|Sakshi
తలమడుగు పోలీసులు పట్టుకున్న నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలు(ఫైల్‌)

జిల్లాలో నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల విక్రయాలు

అక్రమ మార్గాల ద్వారా జిల్లాలోకి సరఫరా

గిరిజన గ్రామాలే వ్యాపారుల లక్ష్యం

పలుచోట్ల పట్టుబడ్డ విత్తనాలు

ఇచ్చోడ(బోథ్‌): నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల విక్రయం చాపకింద నీరులా జోరుగా సాగుతోంది. అక్రమ మార్గం గుండా భారీ ఎత్తున జిల్లాలోకి విత్తనాలను తరలించినట్లు తెలుస్తోంది. ఆంధ్రా ప్రాంతం నుంచి లక్షలాది రూపాయల విలువైన విత్తనాలను దిగుమతి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి గత ఏడాది కంటే అధికంగా నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, కుమురంభీం  జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని విక్రయించాలని చూస్తున్నట్లు తెలిసింది. గత రెండు నెలల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల లక్షలాది రూపాయల విలువైన విత్తనాలు పట్టుబడినా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. పదేళ్ల క్రితం బీటీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. వీటిని విత్తుకోవడం ద్వారా చీడపురుగుల ధాటికి తట్టుకుని పెట్టుబడులు తగ్గుతాయనే ఆశతో రైతులు అధికంగా సాగు చేస్తూ వచ్చారు.

గత రెండేళ్ల నుంచి బీటీ పత్తిపై గులాబీ రంగు పురుగు తీవ్ర పెరిగిపోవడం, చీడపీడల ధాటికి బీటీ పత్తి సాగు విఫలమై దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి రైతులు నష్టాల బారినపడ్డారు. పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. రైతులు అప్పుల పాలవుతున్న సంఘటనలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు నిషేధిత బీజీ–3 రకంపై ప్రచారం మొదలుపెట్టారు. ఈ రకం పత్తి విత్తనం కలుపు మందును తట్టుకుని గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా తట్టుకుంటుందని, తద్వారా తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి పొంది లాభాలు పొందవచ్చని చేసిన ప్రచారం ఫలించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గత ఏడాది 3,07,505 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఇందులో సుమారు లక్షా 20 వేల ఎకరాల్లో నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాలు సాగైనట్లు అధికారులు అంచనా వేశారు. నిషేధిత బీజీ–3 విత్తనాలను అడ్డుకుని పూర్తి స్థాయిలో నిలిపి వేయాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జీవ వైవిధ్యానికి హానికరంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ రకం పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వలేదు. ఈ రకం పత్తి పంటకు కలుపు నివారణ కోసం గైసెల్‌ పురుగు మందు వాడాలి. ఈ మందు వాడకం వల్ల బీజీ–3 సాగు చేస్తున్న పక్క పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముందస్తు చర్యలు శూన్యం...
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 విత్తనాల వల్ల కలిగే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలం కాగా.. ఈ రకం విత్తనాలు జిల్లాలోకి ప్రవేశించకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది. గత ఏడాది జిల్లాలోకి అక్రమంగా బీజీ–3 విత్తనాలు సరఫరా అయ్యాక జూన్‌లో విజిలెన్స్‌ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు తూర్పు జిల్లాలో రైలు సౌకర్యాలు ఉన్న ప్రాంతాలతోపాటు ఇటీవల బోథ్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద దాదాపు 300 బీజీ–3 విత్తనాల ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి నిషేధిత పత్తి విత్తనాలను కొందరు వ్యాపారులు జిల్లాలోకి తరలించినట్లు సమాచారం.

ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలే లక్ష్యం..
నిషేధిత బీజీ–3 విత్తనాలను రైతులను అంటగట్టడానికి వ్యాపారులు అధికంగా ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. రెండు జిల్లాలో అధికంగా పత్తి సాగు చేసే రైతులు ఉండడంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఈ రకం పత్తి విత్తనాలను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది గిరిజన రైతులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ రకం విత్తనాలను ఉద్దెర కూడా ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. నిషేధం ఉన్నప్పటికీ ఈ రకం విత్తనాలను రైతులు సాగు చేయడానికి ముందుకు రావడం కూడా వ్యాపారులకు కలిసి వస్తోంది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తే బీజీ–3 విత్తనాల వ్యాపారానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు