యూ ట్యూబ్‌ చూశారు.. ప్రింటింగ్‌ చేశారు

5 Feb, 2020 08:30 IST|Sakshi

స్కానర్, ప్రింటర్‌ వినియోగించి నకిలీ కరెన్సీ తయారీ

గ్రామాల్లోని సంతలు, చిన్న చిన్న దుకాణాల్లో మార్పిడి

తొలిసారిగా నగరంలోచలామణికి వచ్చిన అనుచరులు

తొమ్మిది మందిని పట్టుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: తమ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో నకిలీ కరెన్సీ ప్రింటింగ్‌ విషయం తెలిసింది.. యూ ట్యూబ్‌లో చూసి ఎలా ముద్రించాలో అధ్యయనం చేశారు.. ఓఎల్‌ఎక్స్‌లో స్కానర్‌ కమ్‌ ప్రింటర్‌ను ఖరీదు చేసి మొదలెట్టారు.. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సంతల్లో సర్క్యులేట్‌ చేస్తున్నారు.. సిటీలో మార్చేందుకు వచ్చిన అనుచరుల్ని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకోగా మొత్తం గ్యాంగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వరుసదాడులు చేసిన అధికారులు ముగ్గురు జువైనల్స్‌తో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరి నుంచి రూ.9.27 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఆ అరెస్టుతో ఆలోచన...
సంగారెడ్డి పట్టణానికి చెందిన ఇబ్రహీం బిన్‌ సాలేహ్‌ అక్కడి బసవేశ్వర నగర్‌లో స్టీలు పాత్రల విక్రయం వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి స్నేహితుడైన అక్కడి శ్రీనగర్‌కాలనీ వాసి బండారి గౌతమ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లోని డిప్లొమో పూర్తి చేసి ప్రస్తుతం రియల్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. మూడేళ్ల క్రితం నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాడనే ఆరోపణలపై సంగారెడ్డి పోలీసులు అక్కడే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పుడే ఈ ఇద్దరికీ తామూ నకిలీ కరెన్సీ ముద్రించి చెలామణి చేయాలనే ఆలోచన వచ్చింది. కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లమో చేసిన గౌతమ్‌ తనకు ఉన్న పరిజ్ఞానానికి యూ–ట్యూబ్‌లో చూసిన అంశాలు జోడించి స్కానర్, ప్రింటర్‌ వినియోగించి నకిలీ నోట్లు ముద్రించే విధానాన్ని తెలుసుకున్నాడు. దీంతో గత ఏడాది మార్చ్‌లో ఈ ద్వయం ఓఎల్‌ఎక్స్‌ ద్వారా స్కానర్‌ కమ్‌ కలర్‌ ప్రింటర్‌ను కొనుగోలు చేసింది. ఇషాక్‌ బిన్‌ సాలేహ్‌ ఇంట్లోనే కంప్యూటర్‌కు వీటిని సెట్‌ చేసిన రూ.200, రూ.100 డినామినేషన్స్‌లో నకిలీ కరెన్సీ ముద్రించడం మొదలు పెట్టింది. 

సంతలే టార్గెట్‌..  
ఇలా ముద్రించిన కరెన్సీని చలామణి చేయడానికి సంగారెడ్డికే చెందిన మహ్మద్‌ సోహైల్‌ అలీ (వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌), నగరానికి చెందిన మహ్మద్‌ గౌసుద్దీన్‌ (ప్రైవేట్‌ ఉద్యోగి), అబ్రార్‌ ఖాన్‌ (డీజే ఈవెంట్స్‌ నిర్వాహకుడు), సయ్యద్‌ ఖాసిఫ్‌ బహదూర్‌లతో (విద్యార్థి) పాటు ముగ్గురు మైనర్లను ఏర్పాటు చేసుకుంది. సంగారెడ్డికే చెందిన సోహైల్‌ ప్రస్తుతం బంజారాహిల్స్‌లో పని చేస్తుండటంతో ఇక్కడి వారితో ముఠా సూత్రధారులకు పరిచయాలు ఏర్పడ్డాయి. వీరికి ప్రధాన నిందితులు ఇద్దరూ రూ.10 వేల అసలు కరెన్సీకి రూ.30 వేల నకిలీ కరెన్సీ చొప్పున అందించేది. ఈ ముఠా ప్రధానంగా సంగారెడ్డితో పాటు జహీరాబాద్, సదాశివపేట్, మెదక్‌ల్లో జరిగే సంతల్ని టార్గెట్‌గా చేసుకుని నకిలీ కరెన్సీ చెలామణికి పథకం వేసింది. అక్కడ మార్పిడికి తేలికనే ఉద్దేశంతోనే రూ.200, రూ.100 డినామినేషన్స్‌లో ముద్రిస్తోంది. ఆ సంతలతో పాటు గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే నిరక్షరాస్యుల వద్ద ఈ కరెన్సీని మార్చేస్తోంది. 

చాట్‌ బండార్‌ వద్ద దొరికి..  
కొన్ని నెలలుగా సంగారెడ్డి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చలామణి చేసిన ఈ ముఠా కన్ను ఇటీవల నగరంపై పడింది. చిన్న చిన్న దుకాణాల్లో మార్పిడి చేయడం మొదలెట్టింది. ఈ ముఠాకు చెందిన ముగ్గురు జ్యువైనల్స్‌ జగదీష్‌ మార్కెట్‌లోని ఓ చాట్‌ బండార్‌ వద్దకు వెళ్ళి రూ.200 ఇచ్చి చాట్‌ తిని చిల్లర తీసుకువెళ్ళారు. మళ్ళీ 10 నిమిషాలకే వచ్చిన వీరు మరోసారి చాట్‌ తిన్నారు. మూడోసారీ అలానే రావడం, రూ.200 ఇవ్వడంతో దాని నిర్వాహకుడికి అనుమానం వచ్చింది. అతడి ద్వారా సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌ తమ బృందాలతో వలపన్ని ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి విచారణలో ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో ఆరుగురు నిందితుల్నీ అరెస్టు చేసి వీరి నుంచి రూ.9.27 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు ముద్రణకు ఉపకరించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

గిఫ్ట్‌ రేపర్‌తో సెక్యూరిటీ థ్రెడ్‌
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ ముద్రించే స్థానిక ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఆ నోట్లు అసలు వాటిని పోలినట్లుగా ఉండేందుకు అనేక ‘జాగ్రత్తలు’ తీసుకుంటున్నాయి. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన గ్యాంగ్‌ స్కానర్, ప్రింటర్‌ ద్వారా రూపొందించిన ఫేక్‌ నోట్‌కు సెక్యూరిటీ థ్రెడ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. దీనికోసం గిఫ్ట్‌ రేపర్‌ను కత్తిరించిన వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన నలుగురు నిందితుల్ని పట్టుకున్నామని, వీరి నుంచి రూ.8.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 

సినిమా పెట్టుబడితో నష్టాలు వచ్చి..
నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బీవీ శివ సందీప్‌ ఎంబీఏ పూర్తి చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా మారాడు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న ఇతడు కొన్నాళ్ల క్రితంఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఓ సినిమా నిర్మాణం ప్రారంభించిన ఇతగాడు దాదాపు రూ.కోటి పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తూ... పూర్తిగా ఆ ఊబిలో కూరుకుపోయాడు. ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అక్బర్‌ పాషా అక్యుప్రెషర్‌ విద్యను అభ్యసించి చిన్న క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ మొమిన్‌ ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దాని బాక్‌లాగ్స్‌ పూర్తి చేయలేక మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా మారాడు. ఈ ముగ్గురికీ ఖిల్వత్‌ గ్రౌండ్స్‌ ప్రాంతానికి చెందిన పాల సరఫరాదారుడు మహ్మద్‌ రజియుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఓ ముఠాగా మారి నకిలీ కరెన్సీ ముద్రించి చలామణి చేయాలని పథకం వేశారు. 

స్కాన్‌ చేసి ‘గ్రాఫ్‌’తో సరిచేస్తూ..
కంప్యూటర్‌తో పాటు ప్రింటర్, స్కానర్లను ఖరీదు చేసిన శివ సందీప్‌ తన ఇంట్లోనే ప్రింటింగ్‌ ప్రారంభించాడు. అసలు నోటును స్కానర్‌లో స్కాన్‌ చేసే ఇతగాడు దాన్ని కంప్యూటర్‌లోకి తీసుకువస్తాడు. నోటు ముందు, వెనుక వేర్వేరుగా స్కాన్‌ చేస్తుండటంతో ఒకే కాగితంపై రెండూ పక్కాగా ముద్రితం కావడానికి ఇతగాడు కంప్యూటర్‌లో గ్రాఫ్‌ పేపర్‌ మాదిరిగా డిజైన్‌ చేసి దానిపై స్కాన్‌ చేసిన నోట్‌ను సెట్‌ చేస్తున్నాడు. ఇలా ప్రింట్‌ చేసిన కరెన్సీలో ఎంబోజింగ్‌తో పాటు సెక్యూరిటీ థ్రెడ్, వాటర్‌ మార్క్‌ ఉండట్లేదు. మిగిలిన రెండూ తీసుకురావడం కష్టంగా భావించిన ఇతగాడు సెక్యూరిటీ థ్రెడ్‌ని మాత్రం గిఫ్ట్‌ రేపర్‌తో ‘డిజైన్‌’ చేయగలిగాడు.  

దందాల్లో మార్చేస్తూ...
ఈ గ్యాంగ్‌ తమ దందాల్లో కొన్ని అసలు నోట్ల మధ్యలో నకిలీ నోట్లు ఉంచి చలామణి చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఈ వ్యవహారం సాగిస్తున్న వీరికి సంబంధించిన సమాచారం దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థకియుద్దీన్, వి.నరేందర్‌లు వల పన్ని నలుగురినీ పట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా