కేవలం ఇంటర్‌తో.. డాక్టర్‌ అయ్యాడు!

26 Jun, 2019 14:52 IST|Sakshi

రాజస్థాన్‌: ఇంటర్‌ మాత్రమే చదివిన అతనికి రైలులో ఎంబీబీఎస్ సర్టిఫికేట్‌ దొరకడంతో...ఏకంగా డాక్టర్‌గా చెప్పుకొని  90,000 మంది రోగులను చికిత్స పేరిట మోసం చేశాడు. 44 ఏళ్ల మన్ సింగ్ బాగెల్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తున్న అతన్ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితుడు కేవలం 12 వ తరగతి వరకు మాత్రమే చదివి, ఆస్పత్రిలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ నెలకు లక్ష రూపాయల వేతనం పొందుతూ..5 నెలలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు ఆసుపత్రిలో  అరెస్టు చేశారు.

పోలీసుల విచారణలో భాగంగా..ఐదేళ్ల క్రితం మధురాలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా తనకు డాక్టర్ మనోజ్ కుమార్ మెడికల్ డిగ్రీ దొరికిందని బాగెల్ పోలీసులకు చెప్పాడు. దీంతో తాను డిగ్రీ తీసుకోకుండా ఆగ్రాలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించానని పోలీసులకు చెప్పాడు. బాగెల్ ఆసుపత్రిలో ఇచ్చిన నకిలీ డిగ్రీ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాగెల్ గత సంవత్సరం సికార్ ఆసుపత్రిలో 'డాక్టర్ కావలెను' అన్న ప్రకటన చూసి, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు హాజరయ్యి, ఎంపికయ్యాడు. అతను చేరిన కొన్ని నెలల తర్వాత ఆసుపత్రి అధికారులు బాగెల్ చికిత్స గురించి ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక సందర్భంలో రోగి పరిస్థితి క్షీణించడంతో.. అతన్ని మరో ఆసుపత్రికి పంపవలసి వచ్చింది.

బాగెల్‌ను 420 (మోసం), 467 (ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్), 468 (మోసం కోసం ఫోర్జరీ) కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా.. బాగెల్ ఇద్దరు తమ్ముళ్ళు ఆగ్రాలో మెడికల్ షాపులు నడుపుతున్నారు. 

మరిన్ని వార్తలు