సిటీలో సూడో డాక్టర్లు!

20 Jul, 2020 07:23 IST|Sakshi
నిందితులు మహ్మద్‌ సుభానీ, మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌

ఎలాంటి అర్హత లేకుండా వైద్యుల అవతారం

సమీర్‌ పేరుతో హాస్పిటల్‌ నిర్వహణ

గుట్టు రట్టు చేసిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

‘కొవిడ్‌’ తీగలాగితే కదిలిన డొంక

సాక్షి, సిటీబ్యూరో: ఒకరు చదివింది ఇంటర్మీడియట్‌... మరొకరు పదో తరగతితో స్వస్థి చెప్పారు... అయినప్పటికీ ఇద్దరూ వైద్యుల అవతారం ఎత్తారు. ఒకరు చైర్మన్‌గా, మరొకరు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సమీర్‌ హాస్పిటల్‌ పేరుతో వైద్యశాల సైతం నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరిద్దరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షోయబ్‌ సుభానీ బీకాం రెండో సంవత్సరం చదువుతూ 2006లో స్వస్థి చెప్పాడు. 2011లో మెహదీపట్నం ప్రాంతంలో గ్లోబల్‌ టెక్నో స్కూల్‌ పేరుతో పాఠశాలను నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ కేవలం పదో తరగతి వరకే చదివాడు. ఆపై హుమాయున్‌నగర్‌లోని ఎంఎం హాస్పిటల్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేశాడు.

ఆసుపత్రి ఏర్పాటు చేస్తే భారీ లాభాలు ఉంటాయంటూ తనకున్న అనుభవంతో ముజీబ్‌ తన స్నేహితుడైన షోయబ్‌కు చెప్పాడు. ఇందుకు అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ పేరుతో ఓ ఆధార్‌ కార్డు సంపాదించాడు. దీని ఆధారంగా 2017లో డీఎంఅండ్‌ హెచ్‌ఓకు దరఖాస్తు చేసుకుని ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి పొందారు. ఈ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో సమీర్‌ హాస్పిటల్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో అనేక మందికి వైద్యం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్‌ ముజఫర్‌ అలీ, ఎన్‌.రంజిత్‌కుమార్‌ శనివారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు ఇద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 

‘కరోనా మందుల’ తీగలాగితే...
ఈ నకిలీ డాక్టర్ల దందా గుట్టురట్టు కావడానికి కరోనా మందుల బ్లాక్‌ మార్కెటింగ్‌ వ్యవహారమే కారణం. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కరోనా రోగులకు వాడే రెమిడెసిమీర్‌ ఇంజెక్షన్లకు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు పట్టుకున్న ఏడుగురిలో సమీర్‌ ఆసుపత్రి మెడికల్‌ షాప్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న మహ్మద్‌ ఒబేద్‌ ఒకడు. ఇత గాడు సమీర్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి నిర్వాహకులకు ఈ దందాలో ప్రమేయం ఉందా? అనే కోణంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనుమానించారు. ఈ సందేశం నివృత్తి చేసుకునేందుకు ఆసుపత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుభానీని తమ కార్యాలయానికి పిలిపించారు. ఇతడిని విచారిస్తున్న నేపథ్యంలో తాను డాక్టర్‌ను కాదని, కేవలం అలా చెలామణి అవుతుంటానని, ముజీబ్‌ మాత్రమే డాక్టర్‌ అని అతగాడు చెప్పాడు. దీంతో ముజీబ్‌ను పిలించిన అధికారులు ప్రశ్నించారు. దీంతో ఇతడు కూడా డాక్టర్‌ కాదని, ఇద్దరు సూడో డాక్టర్లు కలిసి సుమీర్‌ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు