జింకులో కావాలా..బంకులో కావాలా..?

10 Apr, 2018 09:45 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్‌ రావు , నిందితుడు యల్లేష్‌

ప్రభుత్వ ఉద్యోగాలంటూ రూ.1.6 కోట్లు స్వాహా

నాలుగు విభాగాల పేర్లు చెప్పి టోపీ పెట్టిన వైనం

నిరుద్యోగుల్ని నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులూ

నిందితుడిని అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంతకీ మీకు స్టీల్‌ ప్లాంటా? షిప్‌యార్డా? ఏషియార్డా? జింకా? బంకా....? వీటిలో ఎందులో ఉద్యోగం కావాలి?’
     ‘వెంకీ’ సినిమాలో హీరో రవితేజతో పాటు అతడి స్నేహితులను మోసం చేసేందుకు కమెడియన్‌ కృష్ణభగవాన్‌ వాడిన డైలాగ్‌ ఇది.
     ‘జీహెచ్‌ఎంసీనా? జలమండలా? ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంటా? స్త్రీశిశు సంక్షేమ శాఖా? వీటిలో ఏ ఉద్యోగం కావాలి?’
     వాస్తవంగా ఆజంపురకు చెందిన ‘బల్దియా సూడో ఉద్యోగి’ బద్దం యల్లేష్‌ దాదాపు 75 మంది నిరుద్యోగులకు టోకరా వేసేందుకు కొట్టిన డైలాగ్‌ ఇది.  

ఈ పంథాలో తనకున్న పరిచయాలను వినియోగించి దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ హైదరాబాద్, కరీంనగర్‌లకు చెందిన ఉద్యోగార్థుల నుంచి దాదాపు రూ.1.6 కోట్లు వసూలు చేసి నిండా ముంచిన ఆరోపణలపై యల్లేష్‌ను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.4.07 లక్షల నగదు, బోగస్‌ గుర్తింపుకార్డు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు వెల్లడించారు. 

మోసపోయి అదే బాట...
ఆజంపురలోని రాజనర్సింహ్మనగర్‌కు చెందిన యల్లేష్‌ బీకాం పూర్తి చేశాడు. 2010లో అబిడ్స్‌ ప్రాంతంలో ఉన్న ఓ బార్‌లో రోజు రూ.600 వేతనానికి పని చేశాడు. రోడ్డు విస్తరణలో భాగంగా 2013లో బార్‌ మూతపడటంతో రోడ్డునపడ్డాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి కరీంనగర్‌కు చెందిన రవీంద్రస్వామితో పరిచయం ఏర్పడింది. సచివాలయంలో అధికారిగా పని చేస్తున్నట్లు చెప్పుకున్న రవీంద్ర తన పలుకుబడి వినియోగించి హైదరాబాద్‌ జలమండలిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ యల్లేష్‌కు చెప్పాడు. ఇందుకుగాను రూ.2 లక్షలు వసూలు చేశాడు. అయితే మరికొందరు ఉద్యోగార్థులనూ వెతికితే అందరికీ కలిపి ఒకే ఆర్డర్‌తో ఉద్యోగాలు ఇప్పించేస్తానని, వారిచ్చే నగదులో కమీషన్‌ ఇస్తానంటూ రవీంద్ర చెప్పడంతో యల్లేష్‌ అందుకు అంగీకరించాడు. దాదాపు 37 మంది నుంచి రూ.1.24 కోట్లు వసూలు చేసి రూ.90 లక్షలు రవీంద్రకు ఇచ్చి, మిగిలింది తాను తీసుకున్నాడు. అయితే అతను ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలం కావడంతో భీమ్‌ రాహుల్‌ అనే యువకుడి ఫిర్యాదు మేరకు గత జనవరిలో కరీంనగర్‌ రెండో టౌన్‌ పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. దీంతో మోసపోయిన యల్లేష్‌ నష్టాన్ని పూడ్చుకునేందుకు అదే బాట అనుసరించారు.

మరికొందరి నుంచిరూ.36 లక్షలు...
నగరం కేంద్రంగా దందా ప్రారంభించిన యల్లేష్‌ జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ వెటర్నరీ విభాగంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నట్లు ఓ బోగస్‌ గుర్తింపుకార్డు సైతం తయారు చేసుకున్నాడు. ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్లే ఇతను అక్కడి పాస్టర్లతో పరిచయం పెంచుకున్నాడు. తన బోగస్‌ గుర్తింపుకార్డు చూపడంతో పాటు తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకున్నాడు. పాస్టర్ల ద్వారా కొందరు, నేరుగా మరికొందరు నిరుద్యోగులకు దొడ్డిదారిన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అటెండర్, సూపర్‌వైజర్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల పేరు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.10 లక్షల వరకు, దాదాపు 28 మంది నుంచి రూ.36 లక్షలు వసూలు చేశాడు. వీరిలో కొందరికి ఉద్యోగం ఖరారైందంటూ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు తీసుకువెళ్ళాడు. వారిని రిసెప్షన్‌లో కూర్చోబెట్టి తన బోగస్‌ గుర్తింపుకార్డు సాయంతో కార్యాలయం మొత్తం తిరిగి వచ్చేవాడు. ఆపై నియామకం వాయిదా పడిందని చెప్పి పంపేవాడు.

జల్సాలకు భారీగా ఖర్చు..
ఇలా వసూలు చేసిన డబ్బుతో యల్లేష్‌ జల్సాలు చేసేవాడు. తన వివాహాన్ని అట్టహాసంగా చేసుకున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన యువకులు ఇచ్చిన ఫిర్యాదులతో ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి ఠాణాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నిందితుడి కదలికలపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప, బి.కాంతరెడ్డి తమ బృందాలతో వలపన్ని సోమవారం పట్టుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాధితులు డబ్బు నేరుగా ఇవ్వడంతో వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉండవు. ఫలితంగా నిందితులు అరెస్టైనా కోర్టులో కేసులు వీగిపోతుంటాయి. అందుకు భిన్నంగా యల్లేష్‌ పక్కా ఆధారాలను ‘అందించాడు’. డబ్బు తిరిగి ఇవ్వమంటూ ఒత్తిడి చేసిన వారికి రూ.20, రూ.100 స్టాంప్‌ పేపర్లపై ఉద్యోగం పేరుతో నగదు తీసుకున్నానని, త్వరలో తిరిగి చెల్లిస్తానంటూ రాసి సంతకాలు చేసి ఇచ్చాడు. వీటిని సైతం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సేకరించారు. ఇవి కోర్టులో బలమైన ఆధారాలుగా పని చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా