నకిలీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అరెస్ట్‌

21 Mar, 2019 07:24 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి స్వాధీనం చేసుకున్న గుర్తింపు కార్డు

రాంగోపాల్‌పేట్‌: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేస్తున్న నకిలీ ఐఎఫ్‌ఎస్‌ అధికారిని రాంగోపాల్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం  సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, పుల్వామా జిల్లా, కంగన్‌ గ్రామానికి చెందిన ఖుర్షీద్‌ అహ్మద్‌ దార్‌ ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం అతను కాశ్మీర్‌ తదితర ప్రాంతాల్లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. అక్కడ ఇతని మోసాలు బయటపడటంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఈనెల 19న సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని హోటల్‌ అన్నపూర్ణలో బస చేసిన అతను అదే రోజు పీజీరోడ్‌లోని దోసె డిలైట్‌ సెంటర్‌కు టిఫిన్‌ చేసేందుకు వచ్చాడు. క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న బేగంపేటకు చెందిన సిద్దార్థరెడ్డిని కలిసి ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా పరిచయం చేసుకుని మాటలు కలిపాడు.

మాటల సందర్భంగా బీటెక్‌ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అందకు రూ.లక్ష  ఖర్చు అవుతుందని చెప్పాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పిన సిద్దార్థరెడ్డి ఖుర్షీద్‌కు రూ.40వేలు ఇచ్చాడు. మిగతా డబ్బు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చిన తర్వాత ఇవ్వాలని సూచించాడు. తాను ఇక్కడే ఓ హోటల్‌లో బస చేశానని సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి తనకు ఫోన్‌ చేయాలని సూచించాడు.  బుధవారం సర్టిఫికెట్లు తీసుకుని హోటల్‌కు వెళ్లిన సిద్దార్థరెడ్డి నిందితుడు ఇచ్చిన మొబైల్‌ నంబర్లకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన సిద్దార్థరెడ్డి రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి పారిపోయేందుకు సిద్దంగా ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నకిలీ ఐడీ కార్డు, మొబైల్‌ ఫోన్, రూ.40వేల నగదు, సింగపూర్‌కు చెందిన రెండు డాలర్లు, కొరియాకు చెందిన 1000వోన్స్‌ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీ, కాశ్మీర్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు