నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

16 Dec, 2017 12:17 IST|Sakshi
నిందితుడు తయారు చేయించుకున్న నకిలీ ఐడీ కార్డు

గిద్దలూరు: తాను ఐపీఎస్‌ అధికారినని చెప్పుకుంటూ తిరుగున్న యువకుడిని గురువారం గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్‌ నిందితుడి వివరాలు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలంలోని వడ్డెమానుకు చెందిన కర్నాటి గురువినోద్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లెలో అవ్వ, తాతల వద్ద ఉంటున్నాడు. గిద్దలూరులోని ఓ కళాశాలలో ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతనికి డిఫెన్స్‌ సర్వీసెస్, పోలీసు అధికారిని కావాలన్న ఆశ బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఐపీఎస్, డిఫెన్స్‌ సర్వీస్‌లకు సంబంధించిన కోచింగ్‌లు తీసుకున్నాడు. ఇతనితో పాటు కోచింగ్‌ తీసుకున్న వారంతా వివిధ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు.  వినోద్‌కు మాత్రం ఉద్యోగం రాలేదు.

దీంతో తనలో ఉన్న కోర్కెను తీర్చుకోవాలని, అందరితో ఐపీఎస్‌ అనిపించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌కు చెందిన నకిలీ ఐడీ కార్డు, వాయుసేనకు సంబంధించి ఫైలెట్‌గా ఐడీ కార్డు, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు సెలక్ట్‌ అయినట్లు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తయారు చేసుకున్నాడు. తాను ఐపీఎస్‌ అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు సైతం వచ్చిన ఇతడు తాను ఐపీఎస్‌ అధికారినంటూ హడావిడి చేయగా అనుమానం వచ్చిన ఎస్‌ఐ కొమరం మల్లికార్జున అతని ఐడీ కార్డులపై విచారణ చేపట్టారు. కాగా ఇతను ఐపీఎస్‌ అధికారిగా చెప్పుకుంటున్నాడే తప్ప ఎవరినీ బెదిరిం చడం, నగదు వసూళ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని సీఐ శ్రీరామ్‌ పేర్కొన్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌కు సంబంధించిన ఐడీ కార్డు, అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను పోర్జరీ చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. 

మరిన్ని వార్తలు