వంచనకు బ్యాక్‌డోర్‌ తెరిచారు

5 Mar, 2020 08:13 IST|Sakshi
అరెస్టయిన నిందితులు

ఉద్యోగాలిప్పిస్తామంటూ నియామక పత్రాలు

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

రూ.48.16 లక్షలు స్వాధీనం  

వివరాలు వెల్లడించిన రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు

సాక్షి, సిటీబ్యూరో: బ్యాక్‌డోర్‌ ఎంట్రీలో రైల్వే, అటవీ, పోస్టల్‌ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసగించి రూ.లక్షలు దండుకున్న ఏడుగురు సభ్యుల ముఠాను మల్కాజిగిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో రెండుసార్లు ఇదే పోలీసులకు చిక్కిన శివరంజని అలియాస్‌ స్వాతిరెడ్డి నేతృత్వంలోని హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 మందిని మోసగించారు. ఈ ముఠా ఇచ్చిన నకిలీ నియామకపత్రాలు, ఐడెంటీ కార్డులు తీసుకొని ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళితే మోసం చేశారని తేలడంతో ఎల్‌బీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎల్‌బీనగర్‌ పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. గత నెల 28న ఇద్దరు చిక్కగా.. బుధవారం మరో అయిదుగురు పట్టుబడ్డారు. రూ.48.16 లక్షలతో పాటు నకిలీ నియామక పత్రాలు, పది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు వెల్లడించారు. 

ముఠాకు శివరంజని నేతృత్వం
ఫిర్జాదిగూడలో నివాసముంటున్న కరీంనగర్‌ జిల్లా టేకుర్తికి చెందిన గృహిణి శివరంజని అలియాస్‌ స్వాతిరెడ్డి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగినిగా పరిచయం చేసుకునేది. తన సహచరుడు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రాధాకృష్ణ కూడా రైల్వే ఉద్యోగిగానే వ్యవహరించేవాడు. తన స్నేహితుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రమేష్‌బాబును ఫోన్‌లో సంప్రదించి రైల్వే, అటవీ విభాగాల్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే బ్యాక్‌డోర్‌ ఎంట్రీలో ఇప్పిస్తానంటూ  ఒక్కొక్కరి నుంచి రూ.6.5 లక్షలు తీసుకుంటామని నమ్మించాడు. ఒక్కో అభ్యర్థికి భారీగానే కమిషన్‌ ఇస్తానని చెప్పడంతో రమేష్‌బాబు తన స్నేహితుడు కడప జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి, మైదుకూరు ఒనిపెంటకు చెందిన మహమ్మద్‌ ఖలీద్‌ ఖాన్, సికింద్రాబాద్‌ రైల్వేలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చిలకలగూడ వాసి మధుసూదన్‌కు వివరించాడు. కొంతమంది విద్యార్థుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన రమేష్‌బాబు.. రాధాకృష్ణకు తన కమీషన్‌ మినహాయించుకొని రూ.12 లక్షలు ఇవ్వడంతో స్వాతిరెడ్డి ముఠా సహకారంతో నకిలీ నియామక పత్రాలు సృష్టించి అందించారు. మళ్లీ ఎస్‌ఆర్‌నగర్‌లో భావన ఇంటిగ్రేటెడ్‌ సొల్యూషన్‌ డైరెక్టర్‌ జగదీష్‌ నాయుడు కూడా పోస్టల్‌లో ఉద్యోగాలిప్పిస్తాడని రాధాకృష్ణ మళ్లీ వారికి చెప్పడంతో కడపలో చాలామంది విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.12.5 లక్షలు ఇచ్చారు.  

లాడ్జిలో ఇంటర్వ్యూలు.. ఘట్‌కేసర్‌లో శిక్షణ తరగతులు 
సికింద్రాబాద్‌లో రైల్వే ఉద్యోగిగా పనిచేసే బీవీ మధుసూదన్‌రావు ఫిబ్రవరిలో ఏడుగురు విద్యార్థులను వెంట తీసుకొని ఒక్కొక్కరి నుంచి రూ.6.5 లక్షలు తీసుకొని సీబీఎస్‌ సమీపంలోని హిల్‌ టవర్‌ లాడ్జ్‌లో ఉంచి ఇంటర్వ్యూలు తీసుకునేందుకు రైల్వే అధికారులు వస్తారని చెప్పాడు. రమేష్‌బాబు, ఓబుల్‌రెడ్డిల సమక్షంలోనే రాధాకృష్ణ రైల్వే అధికారిగా ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేశారు. అనంతరం కొన్ని నెలలపాటు ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్‌లోని సకల సదుపాయాలున్న ఓ భవనంలో శిక్షణ ఉంటుందని చెప్పి అక్కడికి పంపించారు. అప్పటికే స్వాతిరెడ్డి, రాధాకృష్ణలు వేసుకున్న ప్లాన్‌ ప్రకారం అజీముద్దీన్‌ అనిల్‌ ఇన్‌స్ట్రక్చర్‌గా వ్యవహరించి శిక్షణ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత నకిలీ నియామక పత్రాలు, ఐడీ కార్డులు జారీ చేశారు. ఇవి పట్టుకొని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు వెళితే మోసమని తెలిసి ఎల్‌బీనగర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టురట్టు అయ్యింది.

ఎల్‌బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ జి.నవీన్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం గత నెల 28న సీతాఫల్‌మండి రైల్వే క్వార్టర్స్‌లో నివాసముండే రైల్వే ఉద్యోగి బీవీ మధుసూదన్‌రావు, కడపలో బ్యాంక్‌ ఉద్యోగి ఓబుల్‌రెడ్డిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా స్వాతిరెడ్డిగా పేరు మార్చుకున్న శివరంజనీతో పాటు మహమ్మద్‌ అజీముద్దీన్,  జగదీశ్‌ కుమార్‌ నాయుడు, కడప జిల్లాలో ఉండే సామాజిక కార్యకర్త రమేష్‌ బాబు, మహమ్మద్‌ ఖాలీ ఖాన్‌లను బుధవారం అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన బాలకృష్ణ, గౌస్‌ పరారీలో ఉన్నారని సుధీర్‌బాబు తెలిపారు. మోసగించిన కేసులో గతంలోనే శివరంజని పోలీసులు అరెస్టు చేశారని ఆయన గుర్తు చేశారు. జైలుకెళ్లొచ్చిన బుద్ధి మారలేదన్నారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ పృథ్వీరావ్, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు