దేవరపల్లిలో దొంగనోట్ల ముఠా హల్‌చల్‌

22 Feb, 2018 11:56 IST|Sakshi

పోలీసులపై ఎదురుదాడి చేసి తప్పించుకునే యత్నం

గాల్లోకి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న ఎస్సై

దేవరపల్లి: దేవరపల్లిలో దొంగనోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను బుధవారం సాయంత్రం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని టుబాకో బోర్డు సమీపంలో గల హోటల్‌ వద్ద దొంగనోట్లు మార్పిడి చేసే ముఠా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసు సిబ్బందితో హోటల్‌ వద్దకు చేరుకుని ముఠా సభ్యులను చుట్టుముట్టారు. దీంతో ముఠా సభ్యులు ఎదురుదాడికి దిగి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఎస్సై గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2,10,900 విలువైన రూ.2,000, 500, 200, 100 దొంగ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు.

కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, సీఐ సి.శరత్‌రాజ్‌కుమార్‌ దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఇద్దరు ముఠా సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీరు తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాకు చెందినవారిగా తెలిసింది. అయితే విజయవాడ కేంద్రంగా పెద్ద ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల యర్నగూడెంలో దొంగనోట్లతో ముఠా సభ్యులు కారులో ఏలూరు వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కారు ఆపి వివరాలు సేకరిస్తుండగా ముఠా సభ్యులు అతివేగంగా కారుతో ఉడాయించినట్టు తెలిసింది. దేవరపల్లి అడ్డాగా చేసుకుని కొన్నేళ్లుగా ఉభయగోదావరి, కృష్ణా, తెలంగాణకు చెందిన ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు