నకిలీ అధికారి ‘దొంగ’ వేషాలు

14 Jul, 2019 07:39 IST|Sakshi
నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఐ. శ్రీనివాసన్‌, నిందితుడు మహమ్మద్‌షఫి (ఫైల్‌)  

పోలీసు, ఆర్‌ఐ, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర అవతరాల్లో దోపిడీలు

నిందితుడి అరెస్ట్‌ 

రూ. 60 వేలు స్వాధీనం

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): అమాయకపు పేదలే అతడి లక్ష్యం. సందర్భానుసారంగా ప్రభుత్వ అధికారిగా అవతారాలెత్తుతాడు. పోలీసు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇలా చెప్పి అందిన కాడికి నగదు దోచుకెళుతున్న ఓ నకిలీ అధికారి దొంగను చిన్నబజారు పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌ ఐ. శ్రీనివాసన్‌ నిందితుడి వివరాలను వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల పెద్దమసీదు వీధికి చెందిన షేక్‌ మహ్మద్‌ షఫి చిన్నతనం నుంచే వ్యసనాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి నేరాలకు పాల్పడసాగాడు. పోరుమామిళ్లలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అక్కడి పోలీసుల చర్యలతో సుమారు 10 ఏళ్ల కిందట నెల్లూరు నగరానికి మకాం మార్చారు. సాలుచింతల వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

పేదలు, చిరు వ్యాపారులు, రోజు వారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నాడు. సయమం, సందర్భోచితాని బట్టి పోలీసుగా, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, కలెక్టరేట్‌ ఉద్యోగిగా చెబుతూ ఎదుటి వారిని బెదిరించి నగదు, బంగారం దోచుకెళ్తున్నాడు. నెల్లూరు నగరంలోని నవాబుపేట, సంతపేట, దర్గామిట్ట, తోటపల్లిగూడూరు తదితర ప్రాంతాల్లో నిందితుడు పలు నేరాలకు పాల్పడ్డాడు. అయితే అనేక మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. పోలీసు వేషంలో దోపిడీలకు పాల్పడుతున్న నిందితుడిని 2017లో నవాబుపేట పోలీసులు, 2018లో సంతపేట పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మహమ్మద్‌ షఫి తిరిగి నేరాలకు పాల్పడసాగాడు. ఇప్పటికే నిందితుడిపై నవాబుపేట పోలీసులు సస్పెక్టెడ్‌ షీటు తెరిచారు. 

బేల్దారిని బెదిరించి నగదు దోపిడీ 
మహమ్మద్‌ షఫి ఈ నెల 11వ తేదీన పోలీసు అవతారమెత్తాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాధాకృష్ణ స్వీటు షాపు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న బేల్దారి మేస్త్రీ రమణయ్యను ఆపాడు. ఆర్టీసీ బస్టాండ్‌లో బ్యాగ్‌లు దొంగతనం చేశావంటూ నిలువరించి, ఎస్సై స్టేషన్‌కు తీసుకురమ్మన్నారని బెదిరించాడు. రమణయ్య తాను ఏ నేరం చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా అతడిని బెదిరించి అతని జేబులో ఉన్న రూ.13,200 నగదు బలవంతగా లాక్కొన్నాడు. స్టేషన్‌కు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి అక్కడ నుంచి ఉడాయించాడు. దీంతో బాధితుడు రమణయ్య చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ ఐ. శ్రీనివాసన్‌ను కలిసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి మోసాలు అనేకం వెలుగులోకి వచ్చాయి.

దీంతో అతని కదలికలపై ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ఎస్సై చిన్ని బలరామయ్య, సిబ్బంది నిఘా ఉంచారు. శనివారం నిందితుడు ఏసీ కూరగాయాల మార్కెట్‌లో ఉన్నారన్న సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఐ. శ్రీనివాసన్‌ తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతన్ని విచారించగా పలు ప్రాంతాల్లో నేరాలు చేసినట్లు అంగీకరించడంతో అతని అరెస్ట్‌ చేశారు. మహమ్మద్‌ షఫి వద్ద నుంచి రూ. 60 వేల నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకునేందుకు కృషి చేసిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై బలరామయ్య, వారి సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎస్సై చిన్నబలరామయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్‌ షఫి బాధితులు ఎవరైనా ఉంటే చిన్నబజారు పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు