‘నిర్భయ’ బాలనేరస్తుడి ఫేక్‌ ఫొటో.. వైరల్‌

14 Mar, 2018 15:18 IST|Sakshi
పోలీసుల అదుపులో నిర్భయ బాలనేరస్తుడు (పాత ఫొటో) (ఇన్‌సెట్‌లో ఫేక్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.. ఆరుగురు దోషుల్లో ఒకడు చనిపోగా, నలుగురికి మరణశిక్ష పడింది. శిక్షల అమలుపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.. ఇక ఈ కేసులో అందరి దృష్టినీ ఆకర్షించిన బాలనేరస్తుడు.. మూడేళ్ల శిక్ష అనంతరం విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అతనికి సంబంధించిన వివరాలేవీ బయటికిరాలేదు.. కానీ  ఆ బాలనేరస్తుడి పేరుతో ఓ నకిలీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘‘ఇతను నిర్భయ కేసులో బాలనేరస్తుడు. పేరు .........., ఢిల్లీలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రస్తుతం వాడు దక్షిణభారతంలో ఉంటున్నట్లు తెలిసింది. హోటళ్లలో సర్వర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే వాడి ఫొటో.. వెతకండి.. అంతటి దారుణానికి పాల్పడినవాణ్ని పనికిరాకుండా చేసేయండి లేదా పైకి పంపేయండి..’’ అనే మెసేజ్‌ వాట్సప్‌లో విపరీతంగా షేర్‌ అవుతోంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లోనూ ఇంతే! అయితే ఇది నకిలీ ఫొటోఅని విశ్వసనీయంగా తెలినట్లు ప్రఖ్యాత ఏఎల్‌టీ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఒక కథనాన్ని రాసింది.

‘‘హోం నుంచి విడుదలైన తర్వాత ఆ బాలనేరస్తుడి బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. అతని పేరుగానీ, ఫొటోగానీ, ఇతర వివరాలేవి బయటికిరాలేదు. బాలనేరస్తుడిదిగా చెబుతోన్న ఆ ఫొటోను ఓ ట్విటర్‌ ఖాతా నుంచి తీసుకున్నారు. ఆ ఖాతా 2013లో మొదలైంది. ఇప్పటివరకు దానినుంచి రెండు ట్వీట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఆ సమయంలో నిర్భయ నేరస్తులంతా జైలులోనే ఉన్నారు. కాబట్టి ఆ ట్వీటర్‌ ఖాతా ఖచ్చితంగా నేరస్తుడిదిమాత్రం కాదు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ప్రచారమిది. ఇలాంటి మెసేజ్‌లు మీకొస్తే స్పందించకండి..’’ అని పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నట్లు ఏఎల్‌టీ న్యూస్‌ తెలిపింది.

వైరల్‌ అయిన నకిలీ మెసేజ్‌..(బ్లర్‌ చేశాం)

మరిన్ని వార్తలు