ఏసీపీ, డీసీపీ, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌.. అన్నీ అతడే!

30 Dec, 2017 08:41 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు సత్యపాల్‌ జౌర్ఖర్‌

హోదా కోసం ఖాకీ వేషం

యాక్టివాకూ పోలీస్‌ సైరన్‌  

టోల్‌గేట్స్‌ నిర్వాహకులు,

‘దేవాలయాలకూ’ టోకరా  

నిందితుడి అరెస్టు  

ఇన్‌స్పెక్టర్‌..ఏసీపీ...డీసీపీ.. కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అన్నీ అతడే...కనిపించని నాలుగో సింహం అవతారమెత్తి ఎందరినో బురిడీ కొట్టించాడు. పోలీస్‌ కావాలనే తన కోరికకు సూడో ముద్ర వేసుకుని వీళ్లూ..వాళ్లూ అనే తేడా లేకుండా దోచుకున్నాడు కాచిగూడకు చెందిన రాఘవేంద్ర సత్యపాల్‌. చివరకు పోలీసులకు చిక్కాడు.

సాక్షి, సిటీబ్యూరో: ఓసారి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌... మరోసారి సూర్యాపేట ఏసీపీ... ఇంకోసారి పోలీసు హెడ్‌–క్వార్టర్స్‌ డీసీపీ... అవసరమైనప్పుడు హోమ్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌... ఇదేదో సినిమాలో క్యారెక్టర్‌ అనుకుంటున్నారా..? కానే కాదు. కాచిగూడకు చెందిన ఓ సూడో పోలీసు అవతారాలు. ఈ ముసుగులో బంధువులు, స్నేహితుల్ని మోసం చేయడమే కాకుండా టోల్‌ప్లాజాలు, దేవాలయాల నిర్వాహకులనూ బురిడీ కొట్టించాడు. తన కార్లకే కాదు.... చివరకు యాక్టివాకు కూడా పోలీసు స్టిక్కర్, సైరన్లు పెట్టి అధికారులకే మతిపోగొట్టాడు. ఈ సూడో పోలీసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. డిపార్ట్‌మెంట్‌లో చేరాలనే కోరిక తీరని ఇతగాడు పలు అవతారాలు ఎత్తినట్లు వివరించారు. 

రెండుసార్లు కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరై...
కాచిగూడ టూరిస్ట్‌ హోటల్‌ సమీపంలోని ఎంజే టవర్స్‌కు చెందిన రాఘవేంద్ర సత్యపాల్‌ జౌర్ఖర్‌కు చిన్నప్పటి నుంచి పోలీసు విభాగంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. 1990, 1992లో కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరైన విజయం సాధించలేదు. తనకు డిపార్ట్‌మెంట్‌పై ఉన్న మోజుతో 2004లో కాచిగూడ ఠాణా మైత్రి సంఘం సభ్యుడిగా చేరి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే అతడికి పోలీసు విభాగాన్ని పూర్తిస్థాయిలో పరిచయం చేసింది. దీంతో తానే పోలీసు అధికారి అవతారం ఎత్తాలని పథకం వేశాడు. కవాడిగూడకు చెందిన ఓ టైలర్‌ వద్ద మూడు యూనిఫామ్స్‌ కుట్టించుకుని ఓ దానికి ఎస్పీ ర్యాంకు, మరోదానికి డీఎస్పీ హోదా, ఇంకోదానికి ఇన్‌స్పెక్టర్‌కు ఉండే బ్యాడ్జీలు తగిలించుకున్నాడు. తరచూ తాను నివసించే చోట ఈ యూనిఫామ్స్‌ ధరించి తిరగడంతో పాటు ఒక్కో సందర్భంలో ఒక్కో హోదాను, పోస్టింగ్‌ను చెప్పేవాడు.  

ఎక్కడిక్కడ ఉన్నతాధికారుల పేర్లు చెప్పి...
ఈ సూడో పోలీసులు ఏదైనా పని మీదో, వస్తువులు ఖరీదు చేయడానికో, వాహనాలను మరమ్మతులు చేయించుకోవడానికో వెళ్ళినప్పుడు పెద్ద బిల్డప్‌ ఇచ్చేవాడు. ఆయా దుకాణాల యజమానులు, మెకానిక్స్‌కు పోలీసు అధికారిగా పరిచయం కావడంతో పాటు ఇప్పుడే ఫలానా ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి వస్తున్నానని, ఏవైనా పని ఉంటే సెక్రటేరియేట్‌లోని తన కార్యాలయానికి రావాలని చెప్పేవాడు. ఇది నమ్మిన ఎవరైనా సచివాలయానికి వెళ్ళి ఇతగాడికి ఫోన్‌ చేస్తే తాను క్యాంప్‌లో ఉన్నానంటూ తప్పిం చుకునేవాడు. ఈ తరహాలో రెచ్చిపోతున్న రాఘవేంద్ర వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అత డిని వలపన్ని పట్టుకున్నారు. మూడు వాహనా లు, నాలుగు బోగస్‌ గుర్తింపుకార్డులు, బుగ్గ బ ల్బులు, పోలీసు యూనిఫామ్స్‌ తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కాచిగూడ పోలీసులకు అప్పగించారు.

నాలుగు గుర్తింపుకార్డులు..

రాఘవేంద్ర ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన నమూనాలను వినియోగించి తన కంప్యూటర్‌ పైనే నాలుగు గుర్తింపు కార్డులు తయారు చేసుకున్నాడు. ఆర్‌ఎస్‌ జౌర్ఖర్, ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు, హోమ్‌ డిపార్ట్‌మెంట్, ఏపీ సెక్రటేరియేట్, హైదరాబాద్‌... ఆర్‌ఎస్‌ జౌర్ఖర్, ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు పోలీసు హెడ్‌–క్వార్టర్స్‌ హైదరాబాద్, తెలంగాణ... అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు... సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదాలతో వీటిని రూపొందించుకున్నాడు. తన కారుతో పాటు రెండు బైక్‌లపైనా పోలీసు, గవర్నమెంట్‌ వెహికిల్‌ అని రాయించుకోవడంతో పాటు కారుకు యాక్టివా వాహనానికీ పోలీసు సైరన్లు బిగించుకున్నాడు. కారులో తిరుగుతున్న సమయంలో టోల్‌ ప్లాజాలకు డబ్బులు ఎగ్గొట్టడంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాల్లో తన బోగస్‌ గుర్తింపుకార్డులు చూపించి రాచమర్యాదలు పొందాడు.  

స్థానికులకు సూర్యాపేట ఏసీపీగా...
కాచిగూడలోని తన ఇంటి పరిసరాల్లో సూర్యాపేట ఏసీపీగా చెప్పుకుంటూ చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేసేవాడు. తన ఇంటి గోడపై ‘చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (బ్లాక్‌ క్యాట్‌ కమాండో), టీఎస్‌ రెసిడెన్సీ అని రాయడంతో పాటు ఏకంగా తాను నివసించే ఫ్లోర్‌లోకే ఇతరులెవరూ ప్రవేశించకూడదంటూ పేర్కొ న్నాడు. దీన్ని చూసిన స్థానికులు భయపడుతుండగా... సంబంధం లేని హోదా లు, డిపార్ట్‌మెంట్స్‌ కలయిక చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రాఘవేంద్ర జగదీష్‌ మార్కెట్‌లో వివిధ రకాలైన వస్తువులకు ఖరీదు చేయడానికి వెళ్ళినప్పుడు డీసీపీగా ‘మారిపోయి’ రాయితీలు, కానుకలు పొందేవాడు. తన కారుపై ఏకంగా ఎర్రరంగు బుగ్గబల్బు బిగించుకున్నాడు. గత నెలలో ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి టోకరా వేశాడు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డీసీపీగా పరిచయం చేసుకుని నెలకు రూ.40 వేల జీతానికి సెక్యూరిటీ అధికారి ఉద్యోగం పొందాడు.

మరిన్ని వార్తలు