పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

15 Jul, 2019 10:54 IST|Sakshi

షాపు యజమానిని కొట్టి వస్తువులు ఎత్తుకెళ్లిన వైనం

సాక్షి, గుంటూరు: సెల్‌ టెంపర్‌ గ్లాసు వేయించుకుని, డబ్బులు అడిగిన షాపు యజమానిని ‘నేను పోలీస్‌’ అంటూ కొట్టి షాపులోని కొన్ని సామాన్లు ఎత్తుకుపోయిన ఓ వ్యక్తిపె బాధితుడు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పంగడిగుంటలో నివసించే వెనిగళ్ల కిరణ్‌ మహిళా కళాశాల రోడ్డులో సెల్‌ఫోన్‌  షాపు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం మహ్మద్‌ అబ్దుల్‌ సిరాజ్‌ అనే వ్యక్తి షాపునకు వచ్చి సెల్‌ ఫోన్‌ పై టెంపర్‌ గ్లాసు వేయమన్నాడు. గ్లాసు సెల్‌ఫోన్‌కు బిగించుకున్న అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాడు. కిరణ్‌ అతనిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు అబ్దుల్‌ సిరాజ్‌ తాను కానిస్టేబుల్‌ను అని చెప్పి డబ్బులు ఇవ్వనన్నాడు.

కిరణ్‌ అదేమిటని ప్రశ్నించడంతో ఇరువురికి గొడవ జరిగింది. కిరణ్‌పై అబ్దుల్‌ సిరాజ్‌ చేయిచేసుకుని షాపులోని సెల్‌ సామగ్రి కొన్నింటిని తీసి తన బండిలో పెట్టుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లి పోయాడు. ఈ హఠాత్‌ పరిణామం నుంచి తేరుకున్న కిరణ్‌ వెళ్లిపోతున్న అబ్దుల్‌ సిరాజ్‌ను వెనుక నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. దీనిపై కిరణ్‌ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌ బాగా మద్యం తాగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు