వీసాలతో మోసం

4 Mar, 2018 01:05 IST|Sakshi

వర్క్‌ వీసాలకు బదులు విజిట్‌ వీసాలు జారీ

పది రోజులపాటు అజర్‌బైజాన్‌లో తిప్పి ఇంటికి పంపించిన వైనం

మోర్తాడ్‌ (బాల్కొండ) : అజర్‌బైజాన్‌ దేశంలో పని పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నిండా ముంచారు. తెలంగాణ జిల్లాలకు చెందిన  60 మంది నిరుద్యోగులను అజర్‌బైజాన్‌కు పంపించిన ఏజెంట్లు పది రోజుల పాటు తిప్పి ఇంటి బాట పట్టించారు. ఒక్కో వీసా కోసం నిరుద్యోగులు రూ.1.40 లక్షల చొప్పున ఏజెంట్లకు చెల్లించారు. అజర్‌ బైజాన్‌లో ఉపాధి ఉందని వారిని నమ్మించిన ఏజెంట్లు ఇప్పుడు చేతులెత్తేశారు.

ఆ దేశ చట్టాల ప్రకారం ఏదైనా వ్యాపారం చేయాలంటే ఆ దేశ పౌరసత్వం ఉన్న వారికే లైసెన్స్‌లను జారీ చేస్తారు. అక్కడ పని చేయాలంటే వర్క్‌ వీసాను పొందాల్సి ఉంది. కానీ ఏజెం ట్లు వర్క్‌ వీసాను కాకుండా తక్కువ ఖర్చుతో విజిట్‌ వీసాలను జారీ చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన తొమ్మిది మంది జనవరి చివరి వారంలో అజర్‌బైజాన్‌కు వెళ్లి అక్కడే పది రోజుల పాటు ఉన్నారు.

తిమ్మాపూర్‌కు చెందిన శేఖర్, చిన్నారెడ్డి, కొలిప్యాక శ్రీనివాస్, కొలిప్యాక అక్షయ్, మురళి, సాకలి భూమేష్‌లతో పాటు మరో ముగ్గురు అజర్‌బైజాన్‌ బాధితులే. వీరితో పాటు భీమ్‌గల్‌ మండలం చేంగల్, ఏర్గట్ల, జలాల్‌పూర్‌లకు చెందిన ముగ్గురు ఉన్నారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఐదుగురు, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్‌ జిల్లాలకు చెందిన యువకులు ఏజెంట్లకు సొమ్ము చెల్లించారు.

తెలంగాణ జిల్లాల నుంచి 60 మంది ముంబైలోని ప్రధాన ఏజెంటుకు రూ.1.40 లక్షల చొప్పున మొత్తం రూ.84 లక్షల వరకు చెల్లించారు. ఇంటికి చేరిన నిరుద్యోగులతో తాము ఒక్కొక్కరికి రూ.40 వేలకు మించి ఇవ్వలేమని లేదంటే మరో దేశం పంపిస్తామ ని ఏజెంట్లు చెబుతున్నారు. దీంతో ఏజెంట్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయా లని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు