ఆత్మలకూ ఓటు!

5 Feb, 2019 12:40 IST|Sakshi

గందరగోళ స్థితిలో బతికున్న వారి ఓట్లు

పక్క రాష్ట్రాల వారికీ జిల్లాలో ఓట్లు

కొత్త ఓటర్లకు అందని కార్డులు

మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న ఓటర్లు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆత్మ’లు ఓటేయడానికి వస్తాయేమో.ఆశ్చర్యంగా ఉందా.. నిజమే. ఘనత వహిస్తున్న అధికార పార్టీ కుటిలత్వంతో జిల్లాలో ఆత్మలకూ ఓటు హక్కు కల్పించారు. బతికున్న వారి ఓట్లు ఎక్కడున్నాయో తెలియదు కానీ కాలం చేసిన వారి ఓట్లు మాత్రం పదిలంగానే ఉన్నాయి. అధికార పార్టీ ఓట్లూ భద్రంగానే ఉన్నా... ప్రతిపక్షం ఓట్లు మాత్రం గల్లంతవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికి కొంత మంది అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.  

నెల్లూరు(పొగతోట): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అ«ధికార పార్టీ కుట్రలు పన్నుతోంది. అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు అధికారులను పావులుగా వాడుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించే కుటిల చర్యలు చేపడుతోంది. ఓటర్ల జాబితాను అనుకూలంగా సిద్ధం చేస్తోంది. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులకు ఓటు హక్కు కల్పించారు. ఇంత వరకు వారికి ఐడీ కార్డులు రాలేదు. కార్డుల కోసం ప్రజలు మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో నివసిస్తున్న వారికీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి.  జిల్లాకు చెందిన చక్రవర్తి కుటుంబం తెలంగాణలో నివాసం ఉంటోంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రవర్తి కుటుంబమంతా ఓటు హక్కు వినియోగించుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఓటు హక్కు పొందారు. పంచాయతీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉదయగిరి, ఎస్‌ఆర్‌పురం, డక్కిలి, బోగోలు, అల్లూరు మండలాల్లో మరణించిన వారి ఓట్లు ఇప్పటికీ తొలగించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2 లక్షల ఓట్లు తొలగించారు..
జిల్లాలో గతేడాది సుమారు 2 లక్షలకుపైగా ఓట్లు తొలగించారు. తొలగించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడంతో వారిలో కొంత మందికి ఓటు హక్కు లభించింది. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 22,06,652 మంది ఓటర్లు ఉన్నారు. 2017లో జిల్లాలో 20,44,122 ఓటర్లు ఉండగా.. 2018లో 20,09,464 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించారు. ఈ విషయంపై ‘సాక్షి’ అనేకపర్యాయాలు కథనాలు ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న ఓటర్ల జాబితాల్లో ఓటు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు.

కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో ఓటు నమోదు కాలేదు. జాబితాలో పేర్లు ఉన్నా..  ఇంత వరకు ఓటరు ఐడీ కార్డులు మంజూరు కాలేదు. ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే డిపార్ట్‌మెంట్‌ పెండింగ్‌ అని సమాధానం వస్తోంది. అధికార పార్టీకి సంబంధించిన వారికి గ్రామాల్లో.. పట్టణాల్లో రెండు చోట్ల ఓట్లు కల్పించుకున్నారు. ఇటువంటి ఓట్లు జిల్లా వ్యాప్తంగా 40 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారు ఉదయం నగరంలో.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఓటు వేయించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు కులాల వారీగా ఓట్లు చీల్చి తొలగించారు. నగరంలోని ఓటర్ల జాబితా గందరగోళంగా ఉంది. కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు పోలింగ్‌ బూత్‌ల్లో ఓట్లు ఉన్నాయి. సమీపంలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు ఉండాలని ఎన్నికల కమిషన్‌ నిబంధనలు చెబుతున్నాయి. అందుకు విరుద్ధంగా నగరంలోని ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. భర్త ఓటు బాలాజీనగరలో ఉంటే భార్య ఓటు నవాబుపేటలో ఉంది. నగరంలోని ఓటర్ల జాబితాను ఆ విధంగా సిద్ధం చేశారు.

ఓటు హక్కు ఉన్న వారందరికీ కార్డులు మంజూరు చేస్తాం.
కొత్తగా వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను పరిశీలించాం. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాం. ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు పంపించాం. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఆన్‌లైన్‌లో వస్తే ఓటర్లకు ఐడీ కార్డులు మంజూరవుతాయి. మీసేవ కేంద్రాల నుంచి ఓటరు ఐడీ కార్డుల పొందవచ్చు.     ఎస్‌వీ నాగేశ్వరరావు, డీఆర్వో

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు