బెట్టింగ్‌ కొంపముంచింది

29 May, 2019 12:21 IST|Sakshi

తీవ్రంగా నష్టపోయిన వైనం

జిల్లాలో రూ.50 కోట్లకుపైగా పందేలు

దిక్కుతోచని స్థితిలో

పలు కుటుంబాలు   

ఉదయగిరి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జోరుగా జరిగిన బెట్టింగ్‌లో టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు తీవ్రంగా నష్టపోయారు. పార్టీ నాయకుల మాటలు నమ్మి గెలుపుపై ధీమాతో అనేకమంది పందేలు కాశారు. జిల్లా అంతటా రూ.50 కోట్లకుపైగా బెట్టింగ్‌ జరిగినట్టుగా అంచనా. ఫ్యాన్‌ హవా స్పష్టంగా కనిపించినా టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యంతో కావాలని గెలుపుపై ఊహాగానాలు వ్యాప్తిచేశారు. దీనిని నమ్మిన కొందరు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, స్థానకంగా నిలబడిన ఎమ్మెల్యేలు గెలుస్తారనే ధీమాతో పందేలు కాశారు. పలువురు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల మెజార్టీపై పందేలు కాసి నష్టపోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.5 కోట్లపైగా బెట్టింగ్‌ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఉదయగిరి, దుత్తలూరు, సీతారామపురం, వింజమూరు, కొండాపురం, కలిగిరి, తదితర మండలాలకు చెందిన టీడీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పందేలు కాశారు. అంచనాలు పూర్తిగా తప్పడంతో నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయి. అటు రాష్ట్రంలోనూ, ఇటు స్థానిక ఎమ్మెల్యేకు భారీ ఆధిక్యత లభించడంతో పెట్టిన పందెంలో ఓడిపోయారు. ఉదయగిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బెట్టింగ్‌ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వింజమూరు మండలంలో ఓ టీడీపీ అభిమాని బెట్టింగ్‌లో రూ.కోటి పోగొట్టుకున్నట్టు సమాచారం. అదేవిధంగా పురుగుమందుల వ్యాపారం చేసే ఓ టీడీపీ అభిమాని రూ.20 లక్షలు వరకు నష్టపోయాడు. వరికుంటపాడు మండలంలో క్రియాశీలకంగా ఉండే ముగ్గురు, నలుగురు టీడీపీ నేతలు బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కావలి కేంద్రంగా ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు సంబంధించి బెట్టింగ్‌ జోరుగా సాగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో పందెంరాయుళ్లు మునిగిపోయారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని బెట్టింగ్‌ల రూపంలో రూ.కోట్లు పోగొట్టుకున్న టీడీపీ సానుభూతిపరులు ఇప్పటికీ కోలుకోలేకున్నారు. 

మరిన్ని వార్తలు