చేతబడి అనుమానంతో..

1 Feb, 2019 07:49 IST|Sakshi
బాధితుడిని పరీక్షించి, రిపోర్టులను పరిశీలిస్తున్న డాక్టర్‌ మహేశ్వరరావు

ఓ కుటుంబంపై మరో కుటుంబం దాడి

దంతాలను పీకేసేందుకు ప్రయత్నం

24 గంటలైనా కేసు నమోదుకు పోలీసుల తాత్సారం

సెటిల్‌మెంట్‌కు టీడీపీ నాయకుల యత్నం

కేసు లేకుండా చేసేందుకు రూ.30 వేల వరకు ఇవ్వజూపిన వైనం

తూర్పుగోదావరి , తుని రూరల్‌:  తుని మండలం తేటగుంట గ్రామంలో చేతబడి చేశారన్న అనుమానంతో ఓ కుటుంబంపై మరో కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన ఇది. ఈ మేరకు తుని రూరల్‌ పోలీసులకు  ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తుండడంతో బాధితులు పాత్రికేయులను ఆశ్రయించారు. గురువారం తుని ఏరియా ఆస్పత్రిలో వారు మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. తేటగుంట గ్రామానికి చెందిన గురజా వెంకట్రావు నాయీ బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజాలాగే బుధవారం వృత్తి ముగించుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా సమీపంలో నివాసం ఉంటున్న కోన నాగేశ్వరరావు, కోన పెదకాపు, కోన సోమేశ్వరరావు, కోన శ్రీను, మహిళలైన కోన గవర్రాజు, కోన చంటమ్మ, కోన ఆనందం, రాణియ్యమ్మ (రాణి)లు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి కర్రలు, చెప్పులతో గురజా వెంకట్రావుపై దాడి చేశారు. చేతబడి చేస్తావా అంటూ అతడి దంతాలు, పళ్లను పీకే ప్రయత్నం చేయగా తీవ్ర రక్తస్రావమైంది.

చేతబడి అనుమానంతోనే..
రెండు నెలల క్రితం కోన కుసుమ కాకినాడలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరిందని, లో బీపీతో ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. నాటి నుంచి అనుమానంతో ఉన్న వీరందరూ ఆకస్మికంగా ముకుమ్మడిగా దాడికి పాల్పడ్డారన్నారు. తమతోపాటు ప్రసవానికి ఇంటికి వచ్చిన తమ కుమార్తె నిండు గర్భిణి రజనీపైనా వారు దాడి చేశారని వాపోయారు. తీవ్రంగా గాయపడిన తామిద్దరం వైద్యానికి ఆస్పత్రిలో చేరామన్నారు.

కేసు నమోదులో తాత్సారం
తీవ్ర గాయాలతో ఉన్న తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు బేరసారాలు జరిపేందుకు ఆస్పత్రికి వచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఎవరివల్లనైనా పొరపాటు జరుగుతుందని, కేసు పెట్టకుండా ఉంటే రూ.30 వేల వరకు ఇస్తామన్నా అంగీకరించలేదని, దాడికి పాల్పడిన అందరికీ శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 24 గంటలైనా కేసు నమోదు చేయలేదని బాధితురాలు కుమారి తెలిపారు. మరోవైపు బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్‌ ఎస్సై కె.సుధాకర్‌ గురువారం సాయంత్రం తెలిపారు. 

మరిన్ని వార్తలు