-

వేధింపులు భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం

30 Apr, 2019 08:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఇటీవల విజయ్‌ విడుదలైన ‘సర్కార్‌’ సినిమాలో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ‍కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడతాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటిస్తాడు. అయితే అక్కడున్న అధికారులెవరూ గుర్తించకపోవడంతో ఒక్క బాలిక మినహా ముగ్గురు అగ్నికి ఆహుతి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కోయంబత్తూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగింది. అయితే అదృష్టవశాత్తు మీడియా ప్రతినిధులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం నుంచి వారు బయటపడ్డారు.

వివరాలు.. కోయంబత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ఓ కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసింది. ఒంటి మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకునే క్రమంలో మీడియా వర్గాలు గుర్తించి, వారిని రక్షించారు. పెట్రోల్‌ క్యాన్‌తో కలెక్టరేట్‌లోకి ఓ కుటుంబం వచ్చినా వారిని అడ్డుకునేందుకు అక్కడ ఏ ఒక్క పోలీసు లేకపోవడం శోచనీయం. కందు వడ్డి వేధింపులు తాళలేక తిరునల్వేలి కలెక్టరేట్‌లో ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మాహుతికి పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. నలుగురు ఆహుతి అవుతున్నా రక్షించేందుకు, మంటల్ని ఆర్పేందుకు తగ్గ పరికరాలు లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో అన్ని కలెక్టరేట్‌ వద్ద అగ్ని నిరోధక పరికరాలు ప్రవేశ మార్గంలోనే ఉంచారు. అలాగే ప్రవేశమార్గంలో భద్రతా విధుల్లో ఉండే పోలీసులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాల్సి ఉంది. అయితే ఇవన్నీ మమా అనిపించే రీతిలోనే ఉన్నాయన్న విమర్శలు ఎక్కువే. ఈ విమర్శలకు బలం చేకూర్చే రీతిలో తాజా ఘటన చోటు చేసుకుంది.

పోలీసు అధికారి వేధింపులతో..
విచారణలో కోయంబత్తూరుకు చెందిన సెల్వరాజ్‌ కుటుంబంగా తేలిసింది. తన ఇద్దరు కుమార్తెల వివాహం కోసం దాచుకున్న సొమ్ముతో గతంలో సెల్వరాజ్‌ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ స్థలాన్ని తనకు ఇవ్వాలని ఓ పోలీసు అధికారి వేధిస్తూ వచ్చినట్టు సమాచారం. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన పక్షంలో న్యాయం లభించదని భావించి, కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడానికి గతంలో ప్రయత్నించారు. అక్కడ కూడా తమ ప్రయత్నం ఫలించకపోవడంతో చివరకు ఆత్మాహుతికి సిద్ధపడి వచ్చామని కలెక్టరేట్‌ వర్గాలకు సెల్వరాజ్‌ వివరించినట్లు తెలిసింది. దీంతో ఆ అధికారి ఎవరో, ఆ స్థలం ఎక్కడ ఉన్నదో తదితర అంశాల మీద సమగ్ర విచారణకు కలెక్టర్‌ రాజామణి ఆదేశించారు.

మరిన్ని వార్తలు