ఆడపిల్లల్ని కన్నందుకు వేధింపులు.. కుటుంబం ఆత్మహత్య

7 Feb, 2018 03:24 IST|Sakshi
కుమార్తె, మనుమరాలు దివిజశ్రీ మృతదేహాల వద్ద రోదిస్తున్న మానస తండ్రి, పక్కన రమేశ్, మానస, పెద్దకూతురు గీతశ్రీ (ఫైల్‌)

సాక్షి, కీసర: కుటుంబసభ్యుల వేధింపులు పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. సొంత అమ్మానాన్నలే వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేని ఓ యువకుడు భార్యాపిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కీసరలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన మణిపడిగ రమేశ్‌ (30), మానస (26), గీతశ్రీ (3), దివిజశ్రీ (ఆరు నెలలు)లుగా పోలీసులు గుర్తించారు. అయితే మానస చీర కొంగులోనే చిన్నారి దివిజశ్రీ చనిపోయి ఇద్దరి శరీరాలు అతుక్కొని ఉండటం అందరినీ కలచివేసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... శామీర్‌పేట మండలం ఉద్దెమర్రికి చెందిన శ్యామల అలియాస్‌ మానస(22)తో రమేశ్‌కు 2014 మార్చి 23న వివాహమైంది. ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌లో తమకున్న ఎకరం భూమిలో రమేశ్‌ బర్రెలకు కావాల్సిన దాణా పెంచుతూ, పాల వ్యాపారం చేస్తున్నాడు. మానసకు మూడేళ్ల కిందట ఓ ఆడపిల్ల (గీతశ్రీ) పుట్టింది. మళ్లీ ఆరు నెలల క్రితం రెండోసారి ఆడపిల్ల (దివిజశ్రీ) పుట్టింది.  

ఆరు నెలలుగా పెరిగిన వేధింపులు
రెండో పిల్ల పుట్టినప్పటి నుంచీ ఆమెకు అత్త అంజమ్మ, మామ రాములు వేధింపులు ఎక్కువయ్యాయి. వీరితో పాటు ఆడపడుచులు పద్మ, లక్ష్మి కూడా ఈమెను వేధించసాగారు. అయినా అటు తల్లిదండ్రులకు నచ్చజెబుతూ, ఇటు భార్యను ఓదారుస్తూ రమేశ్‌ సంసారాన్ని ముందుకు సాగిస్తున్నాడు. అయితే ఆడపడుచు పద్మ సోమవారం మరదలు మానసను కొట్టి, అన్న రమేశ్‌ను అసభ్యపదజాలంతో తిట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లమని గెంటేసింది. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్‌.. భార్య మానస, ఇద్దరు ఆడపిల్లలు గీతశ్రీ, దివిజశ్రీలను తీసుకొని రెండు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ విషయం తెలిసి అక్కడే సమీపంలో ఉండే మానస బంధువులు వారి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో కీసర పెద్దచెరువు కట్ట సమీపంలో రమేశ్‌ స్కూటర్‌తో పాటు మానస, గీతశ్రీ చెప్పులు కనిపించాయి. మానస తల్లిదండ్రులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో తేలియాడుతున్న రమేశ్, కొద్దిదూరంలో పడి ఉన్న గీతశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. చెరువు మధ్యలో మానసతో పాటు ఆమె చీర కొంగులోనే ఆరు నెలల పాప దివిజశ్రీ విగతజీవురాలై కనిపించింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలు పుట్టారని అత్తింటివారు వేధించడంతోనే ఈ ఆత్మహత్యలు జరిగాయని మృతురాలు మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు