కుటుంబం ఉసురు తీసిన దీపావళి గిఫ్టులు

19 Oct, 2019 07:38 IST|Sakshi
సుందరమూర్తి కుటుంబం(ఫైల్‌)

అప్పులపాలైన కుటుంబం

తీర్చేదారి లేక నలుగురి బలవన్మరణం

కుయిలాపాళయంలో తీవ్ర విషాదం

దంపతులిద్దరూ ప్రయివేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం చీటీలు నిర్వహిస్తు్తన్నారు. దీపావళి పండుగ కోసం అదనపు ఆకర్షణలు పెట్టారు. వారి ప్రయత్నాలన్నీ వికటించాయి. అప్పుల గుదిబండ ప్రాణాలమీదికి తెచ్చింది.  అప్పు తీర్చేదారిలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. బంధువులు, ఆత్మీయులకు కన్నీరు మిగిల్చింది. ఈ ఘటన విల్లుపురం జిల్లా వానూరు తాలూకా కుయిలాపాళయంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం జిల్లా వానూరు తాలూకా కుయిలాపాళయం గ్రామానికి చెందిన సుందరమూర్తి(40) బేకరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి (35) గ్రామానికి సమీపంలో నీటిశుద్ధి కేంద్రానికి సొంతమైన సోలార్‌ కిచన్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. వీరికి ప్లస్‌ టూ చదివే కృత్తిక (17), 8వ తరగతి చదువుతున్న షర్మిల (13) అనే కుమార్తెలున్నారు. నీటిశుద్ధి కంపెనీ ఇచ్చిన స్థలంలో ఇల్లుకట్టుకుని వీరు నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురూ కలిసి  కొంతకాలంగా చీటీలు, దీపావళి ఫండ్‌ పేరుతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.30 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీపావళి సమీపిస్తుండగా ఖాతాదారుల నుంచి వత్తిడిపెరగడంతో సొమ్ము, గిఫ్టులు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవైపు అప్పులభారం, మరోవైపు దీపావళి గిఫ్టులు, చీటిపాట సొమ్ము చెల్లించే అవకాశం లేకపోవడంంతో భార్యాభర్తల మధ్య తరచూ వాదోపవాదాలు చోటుచేసుకునేవి. ఈనెల 14వ తేదీన కుయిలాపాళయం గ్రామంలోనితన తల్లిదండ్రులను కలుసుకుని వచ్చాడు. ఆ తరువాత ఆ కుటుంబ సభ్యులెవ్వరూ బయట కనిపించకపోవడంతో పండుగ సందర్బంగా అందరూ ఊరేళ్లి ఉంటారని ఇరుగూపొరుగూ భావించారు.

సుందరమూర్తి కుటుంబం(ఫైల్‌)
అయితే గురువారం రాత్రి వారింటి నుంచి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారింటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా సుందరమూర్తి ఉరికి వెళాడుతూ, భార్య మహేశ్వరి (35), కుమార్తెలు కృత్తిక (17), షర్మిల (13) విగతజీవులై కిందపడి ఉన్నారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన రోజున బయట నుంచి తీసుకొచ్చిన ఆహారంలో విషం కలిపి భార్యా, కుమార్తెలతో తినిపించి హతమార్చిన సుందరమూర్తి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు