ఏలూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

11 Jan, 2020 12:40 IST|Sakshi

దొంగతనం చేశారంటూ యజమానుల వేధింపులు

భార్య, పిల్లలను కొట్టటంతో మానసిక వేదనతోనే

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ పరిధిలో భార్యభర్త తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు రూరల్‌ ప్రాంతంలోని ఎస్‌ఎంఆర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న పామర్తి రాంబాబు, భార్య లక్ష్మీరాటాలు కూలిపనులు, అదేవిధంగా ఒక ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి అనుష్క, చందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తమ యజమాని చెల్లెలి ఇంట్లో పనివారు లేకపోవటంతో లక్ష్మీరాటాలు రెండు ఇళ్లలోనూ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న యజమాని సోదరి ఇంట్లో 12 కాసుల బంగారు ఆభరణం పోయిందని గుర్తించారు. బంగారు ఆభరణాన్ని రాటాలు తీసిందనే అనుమానంతో ఏలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా యజమాని భార్యతోపాటు, ఆమె చెల్లెలు కలిసి రాంబాబు ఇంట్లో సోదాలు చేశారు. కాగా రాటాలు కుమార్తె తన తల్లే బంగారు ఆభరణం తీసిందని యజమాని భార్యకు చెప్పినట్లు వారు చెబుతుండగా, బెదిరించి అలా చెప్పించారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా యజమాని భార్య, ఆమె సోదరి కలిసి రాటాలు, ఆమె కుమార్తెలను తీవ్రంగా కొట్టి, దూషించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాంబాబు, భార్య రాటాలు, ఇద్దరు కుమార్తెలు కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు