రైలు కింద పడి ఆరుగురి ఆత్మహత్య

13 May, 2018 23:02 IST|Sakshi
సంఘటనా స్థలంలో మృతదేహాం

ముగ్గురు చిన్నారులు, 8నెలల పసికందు సహా దంపతుల మృతి

రైలు ప్లాట్‌ఫారం మీదకు రాగానే ట్రాక్‌ పైకి దూకి బలవన్మరణం

కుటుంబ కలహాలే కారణం, ప్రకాశం జిల్లా ఉలవపాడులో దుర్ఘటన

సాక్షి, ప్రకాశం : ఉలవపాడు: కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో పాటు భార్య, భర్త మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన పాశం సునీల్‌ (28)కు ప్రకాశం జిల్లా కందుకూరు నాంచారమ్మ కాలనీకి చెందిన రమా (24)తో వివాహమైంది. వీరు వైఎస్సార్‌ జిల్లా బద్వేలు గాంధీనగర్‌ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటూ మిక్సీ, గ్రైండర్లు వాయిదాల పద్ధతిపై ఇచ్చే వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఉషా (5), మూడేళ్ల వయసున్న కవల పిల్లలు కల్యాణ్, కల్యాణి, 8 నెలల వయసున్న మగబిడ్డ ఉన్నారు.

ఈ నెల 9వ తేదీన వీరంతా కందుకూరు కృష్ణబలిజపాలెంలో బంధువుల వివాహానికి వచ్చారు. అక్కడ భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బద్వేలుకు తిరుగు ప్రయాణమయ్యేందుకు వీరు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉలవపాడు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రి 8.05గంటల సమయంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ ఉలవపాటు స్టేషన్‌కు చేరుకోగానే వీరు ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌ మీదకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్లాట్‌ఫారానికి ఓ వైపు చివరన వీరు కూర్చున్నారని, ఇది ప్రమాద ఘటన కాదని.. ఆత్మహత్యేనని స్టేషన్‌మాస్టర్‌ చెప్పారు. ఆత్మహత్య కారణంగా రైలును 20నిమిషాలపాటు నిలిపివేశారు. కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు, ఆర్పీఎఫ్‌ సీఐ అనురాగ్‌ కుమార్‌ సంఘటనా స్థలిని పరిశీలించారు. 

మరిన్ని వార్తలు