‘తుంగబద్రంత్త' విషాదం

20 Jul, 2020 10:39 IST|Sakshi

తల్లి, ముగ్గురు పిల్లలను బలిగొన్న రోడ్డు ప్రమాదం

కన్నీటి సంద్రమైన తుంగభద్ర గ్రామం

కర్నూలు, మంత్రాలయం రూరల్‌: భార్యాభర్త, ముగ్గురు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం.. విధి చూసి ఓర్వలేకపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కుటుంబ యజమానిని ఒంటరి చేస్తూ.. భార్యను, ముగ్గురు పిల్లలను తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన మంత్రాలయానికి సమీపంలోని తుంగభద్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ఉదయం ఎమ్మిగనూరులోని సోదరి జయమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా మంత్రాలయం శివారులో బైక్‌ అదుపు తప్పి ఇనుప దిమ్మెను ఢీకొన్న ఘటనలో గురుస్వామి కుమారుడు మహేష్‌(4) అక్కడికక్కడే మరణించిన విషయం విదితమే.

ఈ ప్రమాదంలో గాయపడిన భార్య నాగవేణి (26), కుమార్తెలు మౌనిక(7), శైలజ (3) కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక కొన్ని గంటల తేడాతో చనిపోయారు. స్వల్పగాయాలతో బయటపడిన గురుస్వామి ఒంటరిగా మిగిలాడు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న అతను రోదించిన తీరు పలువురిని కలచివేసింది. మృతదేహాలను ఆదివారం కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. బైక్‌ అదుపుతప్పి వేగంగా నల్లవాగు బ్రిడ్జిపైఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టడమే ఈ ఘోరానికి కారణమని వారు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎస్పీతో పాటు మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజ్, బాబు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు