చివరి మజిలీ

3 Jan, 2019 09:26 IST|Sakshi
గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాద దృశ్యం

తిరిగిరాని లోకాలకు నలుగురు కుటుంబ సభ్యులు

 వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఘటన

జవకలకోటలో అలుముకున్న విషాదచాయలు

చిత్తూరు, ములకలచెరువు:బంధువులతో ఆత్మీయతను, ఆనం దాన్ని పంచుకున్నారు. వధూవరులను ఆశీర్వదించారు. తిరిగి స్వగ్రామానికి ఆ కుటుంబ సభ్యులంద రూ కారులో బయల్దేరారు. అదే వారి జీవితంలో చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదం ఆ కుటుం బాన్ని కాటేసింది. ఒకేసారి నలుగురి ప్రాణాలను అనంతలోకాలకు తీసుకెళ్లింది. మరో ముగ్గురు కొన ఊపిరితో మృత్యుపోరాటం చేస్తున్నారు. ఈ విషాదభరిత సంఘటన బుధవారం జరిగింది. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వీఎస్‌ఎస్‌ వర్మ ఎనిమిదేళ్ల క్రితం మండలంలోని సోంపల్లె పంచాయతీ జవకలకోట సమీపంలో భూములు కొనుగోలు చేశారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఇక్కడే స్థిరపడ్డాడు.

వీరితో పాటు అన్న కుమారుడు సుందరరామరాజు కుటుంబం కూడా ఇక్కడే ఉంటున్నారు. స్థానికులకు చేదోడువాదోడుగా ఉంటూ మంచిపేరు సాధించుకున్నారు. బంధువుల పెళ్లి కోసమై గత ఏడాది డిసెంబర్‌ 26న వీఎస్‌ఎస్‌ వర్మ, భార్య భారతి, కుమారుడు సునీల్‌వర్మ, భార్య సుష్మా, కుమార్తెలు జాహ్నవి, సాయి కస్వీక, వీఎస్‌ఎస్‌ వర్మ అన్న కుమారుడు సుందరరామరాజు, భార్య రాధసౌందర్యలు ఎనిమిది మంది కారులో కాకినాడకు బయల్దేరి వెళ్లారు. బంధువుల వివాహంలో వారి సంతో షాలను బంధువులతో పంచుకొని బుధవారం తిరిగి ఇంటికి బయల్దేరారు. గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో భారతి(53), సుష్మా(28), సాయి కస్వీక(02), సుందరరామరాజు(32)లు అక్కడికక్కడే మృతిచెందారు. జాహ్నవి(12), రాధసౌందర్య(26), సునీల్‌వర్మ(35)లు తీవ్రంగా గాయపడడంతో గుంటూరులోని కాటూరి మెడికల్‌ వైద్య కళాశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరి మృతి వార్త తెలిసి జవకలకోటలో విషాదచాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు