గుండెలు పిండే విషాదమే మిగిలింది

5 Jan, 2019 11:55 IST|Sakshi
సుష్మా(ఫైల్‌) సాయి కస్విక(ఫైల్‌) సాయి కస్విక మృతదేహంతో ఆమె తాతయ్య

జన సందోహం నడుమ అంతిమ వీడ్కోలు

కన్నీటి నివాళులతో రోడ్డు ప్రమాదం

మృతులకు అంత్యక్రియలు

చిత్తూరు, ములకలచెరువు: ‘దేవుడా! మా కుటుంబంపై ఎందుకీ పగ?.. ఒక్కసారిగా అందరినీ కడతేర్చావు..మా కుటుంబం కలలన్నీ సమాధి చేశావే..!’ అంటూ వీఎస్‌ఎస్‌ వర్మ రోదించడం అక్కడివారిని కంటతడి పెట్టించాయి. బుధవారం గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెం దడం విదితమే. వీరిలో భారతి(53), సుష్మ(28), సాయి కస్విక(2)మృతదేహాలను శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు సోంపాళ్యం వద్ద వీఎస్‌ఎస్‌ వర్మ ఫామ్‌హౌస్‌కి  తీసుకొచ్చారు. ఇదేరోజు పలువురి కన్నీటి నివాళుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. వర్మ అన్న కుమారుడైన సుందరరామరాజు(38)కు కాకినాడలో దహనక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ, విశాఖపపట్నం, కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగళూరు నుంచి బంధువులు హాజరయ్యారు.

కడసారి చూపులకు నోచుకోని సునీల్‌వర్మ
రోడ్డు ప్రమాదంలో సునీల్‌వర్మ(35) తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన భార్య సుష్మ, తల్లి భారతి, కుమార్తె కస్విక కడసారి చూపులకు కూడా నోచుకోకపోవడం ప్రతి ఒక్కరినీ విచలితుల్ని చేసింది. తాతయ్య చేతుల్లో కస్విక మృతదేహాన్ని చూసి పలువురు అయ్యో! అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దహనక్రియలకు స్థానికులు సహకారం అందించారు.

మరిన్ని వార్తలు