అయ్యయ్యో

30 Apr, 2018 06:50 IST|Sakshi
హృదయవిదారకంగా ఉన్న ఘటనా స్థలి ,చిన్నారులు అంజలి, కోటేశ్వరి

కుటుంబాన్ని మింగేసిన రోడ్డు ప్రమాదం  

బైక్‌ను లారీ ఢీకొనడంతో పిల్లలతో సహా తల్లిదండ్రులు మృతి    

చీమలమర్రిలో పెను విషాదం

ఏమీ మిగల్లేదు.. భర్తకు భార్య.. భార్యకు భర్త.. పిల్లలకు తల్లిదండ్రులు.. అమ్మానాన్నలకు పిల్లలు.. ఇలా ఏ ఒక్క బంధమూ మిగల్లేదు. పచ్చని ఆ కుటుంబంపై కన్నుకుట్టిన విధి పగబట్టినట్టు మొత్తాన్ని మింగేసింది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ కిందపడి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రుల జీవితాలు అర్ధంతరంగా తెల్లారిపోయాయి. ఎటు చూసినా మాంసపు ముద్దలే.. వారి ఆర్తనాదాలు రాత్రి వేళ చిమ్మచీకట్లో కలిసిపోయాయి. తెగిన చేతులు, రక్తం చిందిన శరీరాలు, పగిలిన తలలు.. చూపరుల హృదయాలను ద్రవింపజేశాయి. ఆదివారం రొంపిచర్ల మండలం అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిలో మర్రిచెట్టుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. బుట్టబొమ్మల్లా ఉన్న ఆ చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ గుండెలు చెమ్మగిల్లేలా రోదించారు.

నకరికల్లు: తలకొరివి పెట్టాల్సిన కొడుకు కుటుంబంతో సహా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి ఆవేదన చెప్పనలవి కావడం లేదు. ‘పిల్లలను అమ్మమ్మ వాళ్లింట్లో వదిలి తెల్లారేసరికి వస్తాను జాగ్రత్త.. అని చెప్పి.. నన్ను ఏకాకిని చేసి వెళ్లారే’ అంటూ ఆ తల్లి విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా నకరికల్లు మండలం చీమలమర్రి వాసుల కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గ్రామానికి చెందిన దొంతుల ఆంజనేయులు(38) వ్యవసాయ కూలీ. ఆదివారం కూడా ధాన్యం కాటా పనికి వెళ్లాడు. భార్య తిరుపతమ్మ(35) మిర్చికోతకు వెళ్లింది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు అంజలి(13), కోటేశ్వరి(11) తల్లితోనే ఉన్నారు. పనులు పూర్తయ్యాక నలుగురు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. పిల్లలు అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్దామని మారం చేశారు. నాయనమ్మ దొంతుల లక్ష్మి రెండు రోజులు ఆగి తాను వదలిపెట్టి వస్తానని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా పిల్లలు వినలేదు.  దీంతో పిల్లలను విడిచి రేపు ఉదయం కల్లా వచ్చేస్తామని తల్లితో చెప్పి అద్దంకి సమీపంలోని వేంపాడుకు బయలుదేరారు.

బయలుదేరిన అర్ధగంటలోపే మృత్యువాత
పిల్లలతో సరదాగా వారి అమ్మమ్మ గారింటికి వెళ్తుండగా ఎదురుగా లారీ మృత్యు రూపంలో వచ్చింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే విషయం గ్రామంలోకి చేరింది. కొడుకు, కోడలు, మనవరాళ్ల మృతి వార్త విన్న లక్ష్మి సొమ్మసిల్లింది. ఇరుగుపొరుగు అక్కడకు చేరుకొని ఆమెను ఎంత ఓదారుస్తున్నా ఆమె గుండెకోత తీర్చలేకపోయారు. 

అయోపాపం.. కష్టజీవులు
రోజు కూలీపని చేసుకొనే పేద కుటుంబం. పిల్లలిద్దరూ ఆరో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ‘రెక్కల కష్టం మీద పిల్లలను చదివించుకుంటున్న వారిని.. దేవుడు ఎంత అన్యాయం చేశాడోన’ని గ్రామస్తులు విలపించారు. వృద్ధురాలు లక్ష్మికి ఇద్దరు కుమారులుకాగా పెద్ద కుమారుడు వేరే ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లాడు. 

మరిన్ని వార్తలు