షార్ట్‌ సర్క్యూట్‌తో నలుగురు మృతి

12 Nov, 2018 10:40 IST|Sakshi
భార్య, బిడ్డలతో శ్రీనివాసులురెడ్డి (ఫైల్‌)

మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఘటన  

శ్రీకాళహస్తి: గ్యాస్‌ గీజర్‌ లీకేజికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదంచోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి (34) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య బుజ్జమ్మ అలియాస్‌ భాగ్యలక్ష్మి (28) ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా పని చేస్తోంది. వారికి భవ్య (6), నిఖిల్‌కుమార్‌రెడ్డి (4) సంతానం. వారు శనివారం రాత్రి రాజులకండ్రిగ లోని స్వగృహంలో నిద్రిస్తుండగా గ్యాస్‌ గీజర్‌ పైపు లీకైంది. దానికితోడు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంటిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురూ సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులురెడ్డి ఇంటికి సమీపంలోనే గృహప్రవేశం నిమిత్తం పలువురు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.

ఇంట్లో నుంచి మంటలు వస్తుండడాన్ని గుర్తించి వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సహకరించారు. అయితే అప్పటికే శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వెంటనే పోలీసులు వారి బంధువులకు సమాచారమిచ్చారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రి వైద్యులను రాజులకండ్రిగ గ్రామానికి పిలిపించి అక్కడే పోస్ట్‌మార్టం, పంచనామా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పి.అనిల్‌బాబు తెలిపారు.

ఘటనపై పలు అనుమానాలు..
అయితే ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం గ్యాస్‌ గీజర్‌ లీకై ఏర్పడిందా.. లేదా కావాలనే చేసుకున్నారా అని అనుమానిస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి ఇటీవల ఇంటి స్థలం కొనుగోలు చేయడంతో పాటు రూ.10 లక్షల మేర వెచ్చించి పక్కా భవనాన్ని నిర్మించారు. దాంతో వారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పలుచోట్ల చీటీలు వేశారని, వాటిని కట్టడానికి నానా అగచాట్లు పడ్డారని స్థానికులు వెల్లడించారు. ఇద్దరూ సంపాదిస్తేనే ఆర్థిక కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో బుజ్జమ్మ సమీపంలోని ఓ కర్మాగారంలో సెక్యూరిటీగా చేరారు. ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీనివాసులురెడ్డికి భార్యపై అనుమానాలు మొదలయ్యాయని, మరోవైపు ఆర్థిక కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, దాంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు