ఆమె జీవితం ధన్యం

19 Mar, 2018 07:12 IST|Sakshi
ఆస్పత్రిలో లక్ష్మిని ఆపరేషన్‌ థియేటర్‌కు తరలిస్తున్న వైద్యులు

రోడ్డు ప్రమాదానికి గురై లక్ష్మి అనే మహిళ బ్రెయిన్‌ డెడ్‌

ఆమె కోరిక మేరకు అవయవాలు దానం

గుండె, లివర్, కిడ్నీలు జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు అందజేసిన కుటుంబ సభ్యులు

విశాఖ క్రైం : ఆమె భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా... మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సజీవంగానే ఉంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసినా... పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆదివారం మృతి చెందిన ఇప్పిలి లక్ష్మి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. తాను చనిపోయినప్పటికీ కొందరి బతుకుల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన లక్ష్మి... తాను చనిపోతే తన అవయవాలు దానం చేయండి అని కుటుంబ సభ్యుల నుంచి ముందుగానే హామీ తీసుకున్నారు.  లక్ష్మి కోరికను భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్‌ నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 13న ఉదయం విశాఖ కైలాసపురానికి చెందిన ఇప్పిలి లక్ష్మి (58) ఆంజనేయస్వామి గుడికి వెళుతుండగా ఒక ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు దానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను లక్ష్మి భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్‌లతో పాటు కుమార్తెలు, అల్లుల్లు  పర్యవేక్షించారు. లక్ష్మి మృతదేమాన్ని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు సమాచారం. పుట్టెడు దుఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు లక్ష్మికి ఇచ్చిన మాట నెరవేర్చారు. అంత విషాదంలోనూ వారి ఔదార్యాన్ని చూసి అనేక మంది వైద్యులు, నగర వాసులు ప్రసంసలు కురిపించారు. ప్రమాదంపై నాలుగో పట్టణ సీఐ బి.తిరుమలరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎర్రాజీరావు తెలిపారు.

అమ్మ కోరిక నెరవేర్చేందుకే

అమ్మ ప్రమాదానికి గురైనట్లు సమాచారం రాగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. కొన్ని రోజులుగా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. అయితే ఆదివారం బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అమ్మ కోరిక మేరకు కుటుంబ సభ్యులమంతా కలిసి ఆమె అవయవాలు దానం చేసేందుకు ఏర్పాటు చేశాం. చెన్నై ఆస్పత్రిలో గుండె సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తికి అమర్చేందుకు గుండెను తరలించనున్నారు. లివర్‌ను విశాఖలోని ఫినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి, కిడ్నీలను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అందజేస్తున్నాం.
ఇప్పిలి హేమవెంకట కుమార్‌ (లక్ష్మి కుమారుడు)

>
మరిన్ని వార్తలు