మైనర్‌కు బైక్‌ విక్రయం

29 Dec, 2019 08:19 IST|Sakshi

షోరూం వద్ద కుటుంబ సభ్యుల గొడవ  

సనత్‌నగర్‌: ఓ మైనర్‌ బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించడం వివాదానికి దారితీసింది. దీంతో బేగంపేట్‌లోని ఓ షోరూం వద్ద బాలుడి బంధువులు, షోరూమ్‌ నిర్వాహకుల మధ్య గొడవ జరిగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే నాచారం అన్నపూర్ణ కాలనీకి చెందిన జంగయ్య కుమారుడు సాయి(17) తన సోదరుడితో కలిసి బేగంపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కేటీఎం మోటర్స్‌ షోరూంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న కేటీఎం బైక్‌ కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా తన సోదరుడు నిఖిత్‌(19) పేరు మీద వాహనాన్ని తీసుకున్నాడు. పది రోజుల క్రితం బాలుడు బైక్‌ నడుపుతూ ఘట్కేసర్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు.

ఈ విషయం బాలుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో బైక్‌ ఎక్కడిదని ప్రశ్నించగా.. ఇంట్లో వారికీ చెప్పకుండా తానే వాహనాన్ని కొన్నట్టు చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి జంగయ్య, బాబాయి రవినాయక్‌ శనివారం బేగంపేటలోని కేటీఎం షోరూంకు వచ్చి బాలుడికి ద్విచక్ర వాహనాన్ని ఎలా విక్రయించారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీనిపై 100 డయల్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షోరూం నిర్వాహకులు తమపై దాడి చేశారని బాలుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారే తమపై దాడి చేశారని షోరూం సిబ్బంది మరో ఫిర్యాదు చేశారు. అయితే, తాము బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించలేదని, అతని సోదరుడితో కలిసి వచ్చి కొనుగోలు చేసినట్లు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు