ఆ కుటుంబం క్వారంటైన్‌లో ఉండగా..

4 Jun, 2020 13:52 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌సైదా

అదను చూసి ఇంటిని దోచేశాడు నిందితుడి అరెస్ట్‌

రూ.3.70 లక్షల విలువచేసే సొత్తు స్వాధీనం  

నెల్లూరు(క్రైమ్‌): ఆ కుటుంబం క్వారంటైన్‌లో ఉంది. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన ఓ పాతనేరస్తుడు అదనుచూసి దోచేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌సైదా వివరాలు వెల్లడించారు. శ్రామిక్‌నగర్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారంతా క్వారంటైన్‌లో ఉన్నప్పుడు గుర్తుతెలియని దుండగులు ఆ ఇంటి తలుపులు పగులగొట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. ఇటీవల క్వారంటైన్‌ పూర్తి చేసుకుని వచ్చిన బాధిత కుటుంబం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు షేక్‌ బాజీజాన్‌సైదా, జి.రామారావు, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు తమ సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాల మేరకు చోరీకి పాల్పడింది రామకోటయ్యనగర్‌కు చెందిన షేక్‌ షఫీ అలియాస్‌ మెటల్‌ షఫీగా గుర్తించి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం బుజబుజనెల్లూరు జంక్షన్‌ వద్ద నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా అతను నేరం అంగీకరించాడు. షఫీ వద్ద నుంచి రూ.3.70 లక్షల విలువచేసే 11 సవర్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చికెన్‌ విక్రయ దుకాణంలో పనిచేసేవాడని, వ్యసనాలకు బానిసై దొంగగా మారాడని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. షఫీని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్‌ ఏఎస్సై జె.వెంకయ్య, హెడ్‌కానిస్టేబుల్స్‌ ఎస్‌డీ వారీస్‌ అహ్మద్, ఆర్‌.సత్యం, కానిస్టేబుల్స్‌ జి.అరుణ్‌కుమార్, టి.నరేష్, ఎం.సుబ్బారావులను డీఎస్పీ అభినందించి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు చేశారని బాజీజాన్‌సైదా తెలిపారు.

మరిన్ని వార్తలు