'పొగ'బట్టింది

24 Jan, 2019 07:41 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన గది, కుంపటి

కుంపటి పొగకు ఊపిరాడక మహిళ మృతి

నలుగురికి తీవ్ర అస్వస్థత

ఉరుము గ్రామంలో ఘటన

విశాఖపట్నం, జి.మాడుగుల(పాడేరు): కుమార్తె చదువు, ఆరోగ్యం,యోగక్షేమాలు గురించి తెలుసుకోడానికి వచ్చిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది.  చలి నుంచి రక్షణ కోసం గదిలో పెట్టిన నిప్పుల కుంపటి ఆ కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. అందరికీ ఊపిరాకుండా చేసి ఒకరిని బలిగొంది. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటన మండలంలోని ఉరుము గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జి.మాడుగుల పంచాయతీఉరుము గ్రామానికి చెందిన  కొటారి సింహచలం, శ్వేతకుమారి (శాంతి)(35) దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె ప్రియదర్శిని పాడేరు గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది.

చిన్నకుమార్తె సౌజన్య, కొడుకు శ్రీరామ్‌లను తీసుకుని ఉపాధి కోసం ఏలూరు సమీపంలోని గంగన్నపాలేం వెళ్లారు. అక్కడ కోళ్లఫారంలో పనికి కుదిరారు. గురుకులంలో చదువుతున్న ప్రియదర్శిని చూడటానికి మంగళవారం తల్లి శ్వేతకుమారి చినపాప సౌజన్యతో కలిసి  పాడేరు వచ్చింది. అనంతరం తల్లీకూతుర్లు స్వగ్రామం ఉరుము వెళ్లారు. బంధువు కొటారి చిన్నతల్లి ఇంటిలో రాత్రికి పాపతో కలిసి శ్వేతకుమారి నిద్రపోయింది. వీరితో ఇంటియజమాని చిన్నతల్లి, తూబే లింగమ్మ, కొటారి చిట్టమ్మలు ఒకే గదిలో పడుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వెచ్చదనం కోసం గదిలో నిప్పుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. తలుపులు, కిటికీలు మూసేసి నిద్రలోకి జారుకున్నారు. నిప్పుల కుంపటి పొగ గదినిండా అలముకుంది.

దాని ధాటికి గురై అంతా అపస్మారకస్థితికి చేరారు. బుధవారం ఉదయం 8గంటల వరకు ఇంటిలోని వారు ఎవరూ నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చి పొరుగింటివారు బలంగా తలుపులు, కిటికీలు తెరిచి చూడగా ఐదుగురూ నురగలు కక్కుతూ కనిపించారు. ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా శ్వేతకుమారి చనిపోయి ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని జి.మాడుగుల పీహెచ్‌సీకు తరలించారు. మెరుగైన వైద్యం  కోసం అక్కడి నుంచి పాడేరు ఏరియా అస్పత్రికి తీసుకెళ్లారు.  సంఘటన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ పాడేరు సమన్వమకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మత్స్యరాస వరహాలరాజు పరిశీలించారు. మృతి కారణాలను తెలసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శేతకుమారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు