పండగ వేళ కిరాతకం..కిటికీలోంచి పెట్రోలు పోసి

15 Jan, 2020 10:19 IST|Sakshi

మీరట్‌ : పండగపూట ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌లో ఒక అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. కలకాలం తోడు వుంటాన్న భర్త , నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే.. తన ఐదుగురు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడు కుంటోంది.  కూలీ నాలి చేసి వారిని  రక్షించుకుంటోంది.  ఇంతలో ఏమి జరిగిందో ఏమోగానీ,  తల్లీ బిడ్డలు ఇంట్లోనిద్రిస్తుండగా, గుర్తు  తెలియని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.  తీవ్ర గాయాలతో మొత్తం కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి  విషమయంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం ఢిల్లీకి తరలించారు. మీరట్‌లోని ఖార్ఖోడా ప్రాంతంలోని జాహిద్‌పూర్ గ్రామంలో మంగళవారం ఈ దిగ్భ్రాంతికరమైన  సంఘటన జరిగింది. 

ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ బిష్ట్  అందించిన సమాచారం ప్రకారం రహీన(40) ను ఎనిమిదేళ్ల కిత్రం భర్త  విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయాడు.  దీంతో తల్లీ తండ్రీ  తనే అయి, కూలి పనులకెళుతూ .. వచ్చిన డబ్బులతో బిడ్డల్ని పోషించుకుంటోంది.  కానీ  విధి వారి జీవితాలను తీరని కష్టాల్లోకి నెట్టేసింది. మంగళవారం రాత్రి  బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు వారుండే ఇంటికి కిటికీకి వుండే వైర్ మెష్ ద్వారా ఒక పైపు వేసి మరీ పెట్రోల్ పోసి, నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ కిరాతకం  వెనుక ఎవరు ఉండవచ్చనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి  ఎలాంటి  ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రహీనాకు ఎపుడూ పిల్లలు, వారి పోషణ తప్ప,  వేరే ధ్యాస వుండేది కాదనీ, ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని సమీప బంధువు ఫాతిమా తెలిపారు. ఈ ఘోరం ఎలా జరిగిందో అర్థంకావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడంతో, ఆమె భర్తే ఈ దురాగతానికి పాల్పడి వుంటాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  రహీనా కోలుకుని, ఆమెతో మాట్లాడిన తరువాత గానీ ఏమీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా