కడలి తీరంలో కన్నీటి ఉప్పెన

15 Aug, 2018 12:29 IST|Sakshi
భార్య, బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సుధీర్‌

మూడేళ్ల దాంపత్యంలో ఆప్యాయతల నవ్వులేగానీ..  ఏ రోజూఅపార్థపు అరుపులు వినబడలేదు. అనురాగపు మాటలేగానీ.. అప్పుల కుంపట్లు రగల్లేదు. ముద్దులొలికే బాబు రాకతో మురిపెం రెట్టింపయ్యిందేగానీ.. వివాదాల ముసురు కమ్ముకోలేదు. ఇలాంటి అన్యోన్య కుటుంబంపై విధి విషం చిమ్మింది. మృత్యువు ముంచుకొచ్చిందో, క్షణికావేశమే కాలనాగై కాటు వేసిందో తెలీదుగానీ కొడుకుసహా దంపతులిద్దరినీ బలి తీసుకుంది. మూల స్తంభమైన భర్త ఆయువు ఉరికొయ్యకు వేలాడింది. ఇంటి దీపమైన జ్యోతి జీవితం మృత్యు చీకట్లలో కలిసిపోయింది. ధ్రువతారగా ప్రకాశిస్తాడనుకున్న బిడ్డ నూరేళ్ల జీవితం ఏడాదిన్నరకే ముగిసిపోయింది. మచిలీపట్నం కడలి తీరాన మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన ప్రతి   హృదయంలో కన్నీటి ఉప్పెనై ద్రవించింది.

కృష్ణా జిల్లా, కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం): ఓ ధాన్యం వ్యాపారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. బందర్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. మచిలీపట్నం రాజుపేటకు చెందిన పద్మనాభుని సుధీర్‌ (30) స్థానికంగా తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. అతనికి మూడేళ్ల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన జ్యోతితో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు ధృవ ఉన్నాడు. తల్లిదండ్రులు కింది పోర్షన్‌లో ఉంటుండగా సుధీర్‌ రెండో అంతస్తులో నివసిస్తున్నాడు. మంగళవారం సుధీర్‌ ఎంతకీ కనిపించకపోవడంతో తండ్రి నాగేశ్వరరావు పై అంతస్తులోకి వెళ్లి తలుపుతట్టినా స్పందన రాలేదు.

దీంతో అనుమానమొచ్చిన ఆయన కిటికీ అద్దాలు పగులగొట్టి లోనికి చూడగా సుధీర్‌ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. నాగేశ్వరరావు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా పక్క గదిలో సుధీర్‌ భార్య జ్యోతి, కుమారుడు ధృవ నిర్జీవంగా కనిపించారు. దీంతో నాగేశ్వరరావు తన మిగిలిన ముగ్గురు కుమారులతోపాటు బంధువులకు విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బందర్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఆకుల రఘు, ఇనగుదురుపేట సీఐ ఎస్‌కే నబీ, ఎస్‌ఐ కుమార్, క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం సిబ్బంది ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. జ్యోతి తండ్రి తంగిశెట్టి సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బందర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా