పాపం.. బతికుండగానే ఆయనకు శార్థం!

28 Jan, 2020 09:06 IST|Sakshi
వెంకట్రావు వచ్చాడని తెలిసి ఆయన ఇంటి వద్ద గుమిగూడిన గ్రామస్తులు 

బతికున్న వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబ సభ్యులు ఏకంగా చిన్నకర్మ కూడా చేశారు. ఆ అభాగ్యురాలు చనిపోయిన వ్యక్తి తన భర్త కాదంటున్నా ఎవరూ వినిపించుకోలేదు. నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహం అదృశ్యమైన నీ భర్తదేనంటూ గ్రామస్తులతో పాటు పోలీసులు సైతం బలవంతంగా ఆమెకు నచ్చజెప్పి అంత్యక్రియలు చేయించారు. చనిపోయాడనుకుంటున్న వ్యక్తి నేరుగా ఇంటికి చేరడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. తొలుత కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు. నిదానంగా తమ భయాన్ని వీడి ఆశ్చర్యం నుంచి తేరుకుని లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన కురిచేడు మండలం పొట్లపాడులో వెలుగు చూసింది. 

సాక్షి, ప్రకాశం: కురిచేడు రైల్వేస్టేషన్‌ సమీపంలోని వాగులో ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. రైల్వే లైను కట్ట కింద వాగులో ఉన్న మృతదేహాన్ని తొలుత ఎస్‌ఐ జి.రామిరెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దొనకొండ రైల్వే పోలీసులు తమ పరిధి కాదని బాధ్యతారహితంగా చేతులెత్తేశారు. ఎస్‌ఐ రామిరెడ్డి కేసు నమోదు చేశారు. మృతుడు మండలంలోని పొట్లపాడుకు చెందిన పోలెబోయిన వెంకట్రావై ఉండొచ్చని భావించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంకట్రావు ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య అంజనీదేవి, బంధువులు పొట్లపాడు నుంచి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బంధువుల్లో కొందరు మృతదేహం వెంకట్రావుదిగా తేల్చారు. భార్య అంజనాదేవి మాత్రం మృతుడు తన భర్త కాదన్నా ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్శి ప్రభుత్వాస్పత్రిలో 23వ తేదీన పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని పొట్లపాడులో ఖననం చేయించారు. 

వలస వెళ్లడం వెంకట్రావుకు అలవాటు 
తాపీపని చేస్తూ జీవనం సాగించే వెంకట్రావు తరుచూ ఇంటి నుంచి బయటకు వెళ్లటం అలవాటు. చెప్పా పెట్టకుండా వెళ్లి కొన్ని రోజుల పాటు బయట ప్రాంతాల్లో జల్సా చేయడం అతని నైజం. అలాగే ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో తిరిగి శనివారం రాత్రి రాయవరం రైల్వేస్టేషనుకు చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న తిరునాళ్లలో ఉన్నాడు. పొట్లపాడు గ్రామానికి చెందిన గుడిమెట్ల ఏసుబాబు.. వెంకట్రావును గుర్తించి జరిగిన విషయం చెప్పాడు. వెంకట్రావు కనిపించిన విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే గ్రామస్తులు వెళ్లి వెంకట్రావును ఇంటికి తీసుకొచ్చారు.
 
అభాగ్యుడికి అంత్యక్రియలు  
మృతుడు తన భర్త కాదని తాను మొదట నుంచి సందేహిస్తూనే ఉన్నానని వెంకట్రావు భార్య అంజనాదేవి చెప్పింది. ఇంటి నుంచి వెళ్లిన తన భర్త ఆచూకీ లేకపోవటం, ఫోను పనిచేయకపోవటంతో తాను బంధువుల ఒత్తిడికి తట్టుకోలేక పోయానని చెబుతోంది. తన భర్త నడుముకు ప్లాస్టిక్‌ ధారాలతో అల్లిన మొలతాడును పాత్రికేయులకు చూపించింది. కానీ మృతదేహాం నడుముకు నల్లని తాడు ఉండటంతో తాను బంధువులతో విభేదించానని తెలిపింది. తన భర్తగా భావించి ఎవరో అభాగ్యుడికి అంత్యక్రియలు చేశానని పేర్కొంటోంది. వెంకట్రావుకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న కర్మ ఆదివారం చేశారు. మరో వారంలో పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంది. అంజనాదేవికి పుట్టింటి వారు, బంధువులు పసుపు కుంకుమ, బట్టలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో వెంకట్రావు ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ.. మృతుడు ఎవరు? 
స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద వాగులో పడి ఉన్న మృతదేహం ఎవరిది? పోలీసులు కేసు నమోదు చేసిన విధంగా మృతుడు వెంకట్రావు కాదని తేలింది. అయితే వాగులో లభ్యమైన మృతదేహం ఎవరిది. ఏ ప్రాంతానికి చెందినది. పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు