ప్రాణం తీసిన విద్యుత్‌ తీగలు

16 Dec, 2019 12:13 IST|Sakshi

కాడెద్దులు, రైతు మృతి  

ప్రమాదంలో చనిపోయిన ఎద్దులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజుపాళెం: పొలంలో ఉన్న విద్యుత్‌ తీగలు ఓ రైతుతో పాటు రెండు మూగ జీవాల ప్రాణాలు బలిగొన్నాయి.  రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన విషాదం మిగిల్చింది. గ్రామానికి చెందిన నాయకంటి నడిపి గురివిరెడ్డి (62) అనే రైతు ఉదయాన్నే పగిడాలకు వెళ్లే రహదారిలో రేగులకుంటకు సమీపంలో పెసర పంటలో కత్తెరమొంట్లు సేద్యం చేసేందుకు వెళ్లాడు. అయితే పొలంలోకి వెళ్లే సమయంలో ఎత్తుగా ఉన్న పొలంలో నుంచి కిందికి దిగుతుండగా కాడికి కట్టిన వృషభరాజం కిందికి దిగుతుండగా గొర్రు నగలు పైన ఉన్న విద్యుత్‌ తీగలకు ప్రమాదశాత్తు తగలడంతో వృషభరాజములతో పాటు రైతు గురివిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.   మృతిచెందిన ఎద్దుల విలువ సుమారు రూ.3 లక్షలు వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని రాజుపాళెం ఇన్‌చార్జి ఎస్‌ఐ బీవీ కృష్ణయ్య, ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ పరిశీలించారు. భర్త మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మృతుడి భార్య భారతి గుండెలు పగలేలా రోదించింది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకరరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ది వెంకటరమణారెడ్డి, లక్కిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు చిన్న లక్ష్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎద్దులతో వీడదీయరాని బంధం
విద్యుదాఘాతంతో ఆదివారం మృతిచెందిన  ఎద్దులకు, మృతి చెందిన రైతు గురివిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది.  ఆ మూగ జీవాలే సర్వస్వం అన్నట్లుగా ఆ రైతు ప్రతినిత్యం వాటి ఆలనా, పాలనాతోనే గడుపుతూ వచ్చాడు. మొదటి నుంచి మంచి మేలు జాతి వృషభరాజములను తెచ్చుకొని వాటిని బండలాగుడు పోటీలకు తీసుకెళ్లేవాడు.  విధి విచిత్రం ఏమోగానీ ఆదివారం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఆ రైతు  కాడి ఎద్దులతో పాటు తాను కూడా మృతి చెందడం అందరిని కలచివేసింది. పోస్టుమార్టం అనంతరం అర్కటవేముల సమీపంలోని పొలంలో రైతు మృతదేహం పక్కనే ఆ రెండు ఎద్దుల మృత దేహాలను ఖననం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా