అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

14 Jan, 2020 10:59 IST|Sakshi
మనోహర్‌ , సూసైడ్‌ నోట్‌

చిత్తూరు ,వరదయ్యపాళెం: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన  వరదయ్యపాళెం మండలం సంతవేలూరు పంచాయతీ సాతంబేడులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు.. సాతంబేడు గ్రామానికి చెందిన డి.రమణయ్య కుమారుడు డి.మనోహర్‌ (37) ఐటీఐ చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట చేతికందలేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అంతకంతకు పెరిగిపోయాయి. గత ఏడాది రూ.లక్షన్నరతో వేసిన 4 బోర్లలో నీళ్లు పడలేదు.రెండేళ్ల పాటు రూ.లక్ష పెట్టుబడితో పెట్టిన పంట చేతికందలేదు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న బంగారాన్ని రూ.70వేలకు బ్యాంకులో తాకట్టు పెట్టగా, మరో రూ.60వేలకు పట్టాదారు పాసుపుస్తకాలపై బ్యాంకులో క్రాప్‌లోన్‌ పొందాడు.

ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం శ్రీకాళహస్తి పట్టణంలో, రెండో కుమార్తె నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 8వ తరగతి ప్రైవేటుగా చదువుతున్నారు. వీరికి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. వ్యవసాయ పెట్టుబడులకు, బోర్లు వేసేందుకు స్థానిక రైతుల వద్ద చేసిన రూ.2లక్షలు అప్పు అంతకంతకు పెరిగిపోవడంతో వారి నుంచి ఒత్తిడి పెరిగింది. మనస్తాపం చెందిన మనోహర్‌ తన అప్పుల ఇబ్బందులను రాతపూర్వకంగా సూసైడ్‌ నోట్‌లో పొందుపరిచి సోమవారం తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సూసైడ్‌ నోట్‌లో చివరిగా ముఖ్యమంత్రిని వేడుకుంటూ తన ఆత్మహత్యకు వచ్చే నగదును తన పిల్లల ఖాతాలకు వేయాలని కోరడం గమనార్హం. సమాచారం అందుకున్న స్థానిక పోలీ సులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. సత్యవేడు ఏరియా ఆసుపత్రిలో మనోహర్‌ మృతదేహానికి శవపంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు