కరెంటు కాటు.. రెండు సార్లు షాక్‌తో రైతు మృతి

5 May, 2019 10:06 IST|Sakshi
మోటార్‌పై పడిపోయిన సురేందర్‌రావు, ఇన్‌సెట్లో సురేందర్‌రావు(ఫైల్‌)

విద్యుదాఘాతంతో రైతు మృతి

ఖానాపురం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన రూరల్‌ జిల్లా ఖానా పురం మండలంలోని అశోక్‌నగర్‌ శివారు జాలుబంధం కాల్వ కాటమయ్య గుడి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్‌ మాజీ డైరెక్టర్‌ పిన్నింటి సురేందర్‌రావు(45) జాలుబంధం కాల్వ పరిధిలో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం వద్ద పనులు ముగించుకొని తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో జాలుబంధం కాల్వకు అశోక్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ రైతు కాల్వ నుంచి నీటిని పారించుకోవడానికి విద్యుత్‌ మోటార్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

కాల్వలోనుంచి కట్టమీదుగా పొలంలోకి పైపును ఏర్పాటు చేశాడు. దీంతో అటువైపుగా వచ్చిన సురేందర్‌రావు కట్టమీద ఉన్న పైపును పక్కనపెట్టి తన వాహనాన్ని దాటించుకోవడానికి ద్విచక్రవాహనాన్ని కట్టపై పెట్టాడు. పైపును తొలగించే క్రమంలో పైప్‌ద్వారా లీకేజీ అవుతున్న నీటికి విద్యుత్‌సరఫరా జరిగింది. షాక్‌కు గురై పక్కనే ఉన్న మోటార్‌పై పడి మరోసారి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి సంఘటనా స్థలానికి చేరుకునే లోపే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరు న విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మృతి చెందడంతో కుటుంబంలో విషా దం నెలకొంది. మృతుడికి భార్య మంగాదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భార్య మంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని విద్యుత్‌ ఏఈ తిరుపతిరెడ్డి, పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు