బైక్‌ ఢీకొని మాజీ ఎంపీటీసీ మృతి

10 Oct, 2017 09:37 IST|Sakshi
మృతి చెందిన యర్రయ్యశెట్టి

ఆగిన సోదరి గుండె

ఆమెకు అన్నంటే ప్రేమ. పెళ్లయి 25 ఏళ్లయినా ఏనాడూ అన్నను చూడకుండా ఉం డలేకపోయేది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ అన్న మృతిచెందిన విషయం తెలియడంతో తల్లడిల్లింది. ప్రాణానికి ప్రాణమైన అన్న ఇక లేడన్న విషయాన్ని ఆ గుండె తట్టుకోలేకపోయింది. కొట్టుకోవడం ఆగిపోయింది. ఒకే రోజు గంటల వ్యవధిలో అన్న, చెల్లెలు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

చిత్తూరు , పీలేరు : బైక్‌ ఢీకొని మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పీలేరు ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. పీలేరు మండలం తలపులకు చెందిన మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి(56) సొంత పనుల నిమిత్తం ఆదివారం పీలేరు వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని తిరిగి వెళుతుండగా జాండ్ల వద్ద మరొక ద్విచక్ర వాహనం ఢీకొంది. యర్రయ్యశెట్టి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పీలేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున యర్రయ్యశెట్టి మృతిచెందాడు.

అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు మృతి
ఈ విషయం తెలుసుకున్న యర్రయ్యశెట్టి చెల్లెలు క్రిష్ణవేణి(46) స్విమ్స్‌ ఆస్పత్రికి వద్దకు చేరుకుంది. అన్న మృతదేహాన్ని చూసి ఆవేదనకు గురైంది. వెక్కివెక్కి ఏడుస్తూ కుప్పకూలిపోయింది. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు. మృతురాలు క్రిష్ణవేణిని తిరుపతికి చెందిన క్రిష్ణమూర్తికి ఇచ్చి 25 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అప్పటి నుంచి ఆమె తిరుపతిలోనే ఉంటున్నారు. అన్న, చెల్లెలు ఒకే రోజు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తలపుల శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా