అప్పుల బాధతో మాజీ సర్పంచి ఆత్మహత్య

29 Jan, 2019 08:12 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన బదిరెడ్డి సత్య సుబ్బలక్ష్మి

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్‌: ఒక పక్క అప్పుల బాధ, మరో పక్క పొలం అమ్మకుండా ఫైనాన్షియర్‌ అడ్డుపడడంతో జిల్లా సర్పంచ్‌ల సమాఖ్య మాజీ కార్యదర్శి, గోకవరం మండలం తంటికొండ మాజీ సర్పంచ్‌ బదిరెడ్డి సత్య సుబ్బలక్ష్మి అలియాస్‌ రోజా (53) పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేట గ్రామంలోని సావిత్రీ నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, రోజా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తంటికొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి బదిరెడ్డి రోజా (53) తన కుమార్తె  వివాహ సమయంలో రాజమహేంద్రవరానికి చెందిన ఫైనాన్షియర్‌ లంకలపల్లి శ్రీనివాసరావు వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో తన పేరుమీద ఉన్న 16 ఎకరాల భూమి, 1000 గజాలు, 400 గజాల ఇంటిస్థలాలు, కుమారుడు చంద్రశేఖర్‌ పేరున ఉన్న ఇంటిని తనఖా పెట్టారు.

ఆ సమయంలో బదిరెడ్డి రోజా, ఆమె కుమార్తె, అల్లుడు, కుమారుడితో ఫైనాన్షియర్‌ ఖాళీ ప్రాంసరీ నోట్లపై, స్టాంపు పేపర్లపై, ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారు. అప్పు తీసుకున్నప్పటి నుంచి రోజా రూ. 47 లక్షలు వడ్డీ నిమిత్తం చెల్లించారు. అలాగే పొలం అమ్మి అప్పు పూర్తిగా చెల్లిస్తానని ఆమె చెప్పినప్పటికీ ఫైనాన్షియర్‌ వినలేదు. పైగా తన అప్పుకు తనఖా పెట్టిన భూములు సరిపోయాయన్నారు. పెద్దల మధ్య పెట్టినప్పటికీ  ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రోజా కొత్తగా తనవద్ద అప్పు తీసుకుందని శ్రీనివాసరావు కోర్డులో దావా వేసి ఆమె అల్లుడు కిరణ్‌ కుమార్‌ ఇంటిని జప్తు చేసేలా ఆర్డరు తీసుకువచ్చాడు. రోజా భర్త చనిపోయినప్పటి నుంచి హుకుంపేట సావిత్రీనగర్‌లోని కుమార్తె, అల్లుడు వద్ద నివసిస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన రోజా ఆదివారం రాత్రి నిద్రించేముందు పురుగులమందు తాగారు. సోమవారం ఉదయం ఏడుగంటల సమయంలో అల్లుడు, కుమార్తె.. ఆమె గదిలోకి వెళ్లి చూడగా నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చి మృతి చెంది ఉంది. అల్లుడు కిరణ్‌కుమార్‌ బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై యూవీఎస్‌ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు