అన్నదాతను బలిగొన్న అప్పులు

8 Aug, 2018 12:42 IST|Sakshi
అశోక్‌ మృతదేహం, విఠల్‌ మృతదేహం

ఆదిలాబాద్‌రూరల్‌: పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో దిగాలు చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌రూరల్‌ ఎస్సై తోట తిరుపతి, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బీరెల్లి అశోక్‌ (32) తనకున్న మూడెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, గులాబీ పురుగు ఉధృతి కారణంగా పంట నష్టపోయి అప్పుల పాలయ్యాడు. పెట్టుబడి డబ్బులు సైతం రాలేదు. ఈయేడాది కూడా ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక దిగాలు చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.

గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అశోక్‌కు భార్య గంగమ్మ ఉంది. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబీకుల రోదన చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే అశోక్‌ మృతి చెందడాన్ని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


ఉరేసుకుని ఆత్మహత్య..
ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన ఎస్‌.విఠల్‌ (33) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్‌రూరల్‌ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. విఠల్‌ మతిస్థిమితం సరిగాలేక గతంలో సైతం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మధ్యాహ్న ఇంటికొచ్చిన మృతుడి తండ్రి గణపతి విషయాన్ని గమనించి స్థానికులు, కుటుంబీకులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య మంగళ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు